విశాఖపట్టణం, జూన్ 21,
నారా లోకేష్ రాజకీయాల్లోకి దొడ్డి దారిన వచ్చారు. ఇది ఆయన ఎదుర్కొనే ప్రధాన విమర్శ. ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టారు. ఇక 2019 ఎన్నికల్లో పోటీ చేసినా ఆయన ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. అప్పట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ ఎమ్మెల్సీ పదవులున్నా వాటికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ నారా లోకేష్ మాత్రం ఎమ్మెల్సీ పదవికి పోటీ చేయకుండానే ఎన్నికల్లో పోటీ చేశారు ఇక మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ దారుణంగా ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నేతగా ఉన్న నారా లోకేష్ మొన్నటి ఎన్నికలలో ఓటమి పాలు కావడం జీర్ణించుకోలేకపోతున్నారు. మంగళగిరి లో సామాజిక పరిస్థితులు తనకు అనుకూలించలేదని నారా లోకేష్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మంగళగిరిలో మరోసారి పోట ీచేసినా విజయం కోసం టెన్షన్ పడాల్సిందేనన్న ఆలోచనలో నారా లోకేష్ ఉన్నారు. అందుకోసమే ఆయన ఈసారి నియోజకవర్గం మార్చాలని భావిస్తున్నారు. ఇందుకోసం రెండు నియోజకవర్గాలను ఆయన ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక పెనమలూరు నియోజకవర్గం కాగా, మరొకటి భీమిలి నియోజకవర్గం. గత ఎన్నికల్లోనే నారా లోకేష్ భీమిలీ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే చివరి నిమిషంలో అక్కడ సబ్బం హరికి టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చింది. సబ్బం హరి ఇటీవల మరణించడంతో భీమిలి నియోజకవర్గం ఖాళీ అయింది.దీంతో భీమిలీ అయితే సేఫ్ అని నారా లోకేష్ భావిస్తున్నారట. అందుకోసమే నారా లోకేష్ ఇటీవల తరచూ విశాఖ జిల్లా పర్యటనలు చేస్తున్నారంటున్నారు. దీంతో పాటు పెనమలూరు నియోజకవర్గం కూడా టీడీపీకి బలమైనదే. నియోజకవర్గంలో అత్యధిక సార్లు టీడీపీ గెలవడంతో ఇక్కడ సామాజికవర్గం కోణంలో చూసినా సేఫ్ నియోజకవర్గంగా నారా లోకేష్ భావిస్తున్నారు. అందుకే లోకేష్ మంగళగిరిని దూరం పెట్టారని చెబుతున్నారు. నారా లోకేష్ ఈసారి బేస్ ఉన్న నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు.