కరీంనగర్, జూన్ 21,
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో స్మార్ట్‌సిటీ కింద రెండో విడుతలో సుమారు రూ.500 కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ పనులకు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ కంపెనీ బోర్డు సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. పెద్ద ఎత్తున చేపట్టనున్న అభివృద్ధి, వివిధ సుందరీకరణ పనులకు ఆమోదముద్ర వేసినట్లు నగర మేయర్ వై సునీల్‌రావు తెలిపారు. దీనిలో సుమారు 240 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌లు సిద్ధంగా ఉండగా, మరో 260 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు డీపీఆర్‌లు సిద్ధం చేయాల్సి ఉంది.వీటన్నింటినీ వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మొదటి సారిగా స్మార్ట్‌సిటీ కింద నగరంలోని ప్రతి ఇంటికీ డిజిటల్ డోర్ నంబర్లను కేటాయించే పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు 6 కోట్ల నిధులు కేటాయించారు. అలాగే నగరంలోని ప్రధాన మురుగు ప్రధాన కాల్వలను అభివృద్ధి చేయడం, పూర్తిస్థాయిలో వర్షకాలంలో ఇబ్బందులు లేకుండా నిర్మించేందుకు గానూ 150 కోట్ల నిధులను వ్యయం చేయనున్నారు. నగరంలోని భూగర్భ డ్రైనేజీ పనుల్లో భాగంగా ఇన్‌స్పెక్షన్ చాంబర్ల నిర్మాణం ఇతర పనుల పూర్తికి 48 కోట్లను కేటాయించారు. నగరంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు 13 కోట్లు, సీసీ కెమెరాల ఏర్పాటుకు 23 కోట్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం 22 కోట్లు కేటాయించారు. అలాగే నగరంలో జిల్లా గ్రంథాలయాన్ని 7 కోట్లతో డిజిటల్ లైబ్రరీగా మార్చనున్నారు. మల్టీపర్పస్ స్కూల్ మైదానంలో చేపడుతున్న పార్కు పనుల్లో భాగంగా స్కూల్ భవనాన్ని హెరిటేజ్ భవనంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు 40 కోట్లను కేటాయించి పనులు చేపట్టనున్నారు. వీటితో పాటు ఏళ్ల తరబడిగా అపరిష్కృతంగా ఉన్న డంప్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో భాగంగా బయోమైనింగ్ పనులకు ఆమోదం తెలిపారు.అతి త్వరలోనే టెండర్ల పక్రియ పూర్తి చేసి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే నగరంలోని పలు ప్రభుత్వ స్కూల్స్‌లో ఈ-లెర్నింగ్‌లో తరగతులు నిర్వహించేందుకు 10 కోట్లను కేటాయించారు. వీటితో పాటుగా 50 కోట్లతో నగరంలోని 30 ఫీట్ల వెడల్పు ఉన్న రోడ్లను కూడా స్మార్ట్‌సిటీ కింద అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే నగరంలోని అనేక లింక్ రోడ్లను స్మార్ట్‌సిటీ కింద అభివృద్ధి చేస్తున్నారు. ఈ పనులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో తుది దశకు చేరగా, మరికొన్ని ప్రాంతాల్లో వేగంగా సాగుతున్నాయి. వీటితో పాటు నగరంలోని పలు చౌరస్తాలను మరింత సుందరీకరించేందుకు ఆమోదం తెలిపారు. వీటితో పాటు 24 గంటల పాటు మంచినీటి సరఫరా అందించేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్న పనులకు ఆమోదముద్ర లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు హౌసింగ్‌బోర్డు కాలనీ, రాంపూర్ రిజర్వాయర్లను ఎంపిక చేసి ఈ ప్రాంతాల్లో పరిధిలో ముందుగా 24 గంటల మంచినీటి సరఫరా చేసేందుకు అవసరమైన నూతన పైపులైన్లు వేయడం, ఇతర పనులు చేపట్టనున్నారు. తదనంతరం 24 గంటల నీటి సరఫరాకు సంబంధించి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.