YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గ్యారెంట్ లేకుంటే సీటుకు నో గ్యారెంటీ

గ్యారెంట్ లేకుంటే సీటుకు నో గ్యారెంటీ

యాజమాన్య కోటా సీట్లు తీసుకునే మెడికల్‌ పీజీ విద్యార్థులతో ప్రైవేట్‌ వైద్య కళాశాలలు ఆడుకుంటున్నాయి. వర్సిటీ నిబంధనల ప్రకారం యాజమాన్య కోటా(బీ కేటగిరి)లోసీటు తీసుకునే విద్యార్థులు.. తొలుత వర్సిటీకి రూ.45వేలు చెల్లించాలి. ఆపై వర్సిటీ ఇచ్చిన లేఖ తీసుకెళ్లి వారికి కేటాయించిన కళాశాలలో సమర్పించాలి. ఆ లేఖతోపాటు వెంటనే రూ.12.5 లక్షల ఫీజు చెల్లించాలి. మరో రూ.12.5 లక్షలకు బాండ్‌ ఇస్తారు. అయితే, ప్రైవేటు కాలేజీలు సొంతంగా నిబంధనలను పెడుతుండటం ఇప్పుడు విద్యార్థులను ఇబ్బందిపెడుతోంది. యాజమాన్య కోటాలో సీటు పొందిన వారు రూ.12.5లక్షల ఫీజు, రూ.12.5లక్షలకు బాండ్‌తోపాటు రూ.62.5 లక్షలకు బ్యాంకు గ్యారెంటీ అడుగుతున్నట్లు సమాచారం.

ఈ కోటాలో చాలామంది మధ్య తరగతి విద్యార్థులు ఉన్నారు. వారికి అంతమొత్తంలో బ్యాంకు గ్యారెంటీ ఇవ్వడం సాధ్యమయ్యే విషయం కాదు. మరోవైపు యాజమాన్య కోటా ఫీజు అంశం కోర్టులో ఉంది. కోర్టు ఇచ్చిన స్టే ప్రకారం రూ.12.5లక్షల ఫీజు, రూ.12.5లక్షలకు బాండు తప్ప కళాశాలలకు విద్యార్థులు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ ప్రైవేట్‌ కళాశాలలు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వకపోతే సీటు రద్దు చేస్తామని, అడ్మిషన్‌ ఇవ్వబోమని ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం ఇలా ఉండగానే.. వర్సిటీ అధికారులు శనివారం ఒక నోటిఫికేషన్‌ ఇచ్చారు. యాజమాన్య కోటా సీటు పొందిన విద్యార్థులు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని సూచించారు. అయితే ఎంత మొత్తం అనేది అందులో ప్రస్తావించలేదు. దీనివల్ల ప్రైవేటు కాలేజీలు మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని విద్యార్థులు వాపోతున్నారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన వారే యాజమాన్య కోటాలో సీట్లు పొందారు. వీరిలో తెలంగాణవారే ఎక్కువగా ఉన్నారు. తెలంగాణలో ఇంకా కౌన్సెలింగ్‌ మొదలు కాకపోవడంతో ఆ రాష్ట్రానికి చెందినవారు ఏపీకి వచ్చారు. ఫలితంగా ఏపీకి చెందిన వారు సీట్లు పొందలేకపోయారు. వచ్చినా మంచి విభాగాలలో రాలేదు. తెలంగాణలో మే 2వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ మొదలవుతుండటంతో.. ఇక్కడ జాయినింగ్‌ తేదీని మే నెల 3 వరకూ వాయిదా వేయాలని ఏపీ విద్యార్థులు కోరుతున్నారు.

నీట్‌ కటాఫ్‌ శాతాన్ని తగ్గించడంతో అర్హత సాధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ నిర్ణయించింది. ఈ నెల 30, మే 1 తేదీలలో దరఖాస్తులు చేసుకోవచ్చు. మే 2, 3వ తేదీల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. మే నెల మొదటి వారంలో నిర్వహించే రెండోవిడత కౌన్సెలింగ్‌ కోసం వెబ్‌ ఆప్షన్‌ పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

Related Posts