న్యూఢిల్లీ, జూన్ 21,
కరోనా వ్యాక్సినేషన్ కొత్త విధానం అమల్లోకి వచ్చిన రోజే ఇండియా కొత్త రికార్డును అందుకుంది. రోజువారీ వ్యాక్సినేషన్లలో గత రికార్డును అధిగమించింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకూ దేశంలో 47.5 లక్షల డోసుల వ్యాక్సిన్లు ఇచ్చారు. ఒక రోజులో ఇచ్చిన అత్యధిక వ్యాక్సిన్ డోసుల రికార్డు ఇదే కావడం గమనార్హం. ఇంతకుముందు రోజులో అత్యధిక వ్యాక్సిన్ల రికార్డు 43 లక్షలుగా ఉంది. ఐదు బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానాల్లో వ్యాక్సిన్ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు.దీంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకే ఈ రాష్ట్రాల్లో 23 లక్షల డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక జులై, ఆగస్ట్‌లో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని పెంచాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ అన్న మోదీ నిర్ణయంతో ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకోనున్నట్లు చెప్పారు.
కరోనాపై జగన్ సమీక్ష
కరోనా వైరస్ నివారణ చర్యలు, హెల్త్ నాడు-నేడుపై ముఖ్యమంత్రి వెఎస్ జగన్‌మహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ వేసిన సిబ్బందికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే వేసే సమర్ధత ఉందని నిరూపించారని పేర్కొన్నారు. పటిష్ట యంత్రాంగంతో రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ సాధ్యమైందని సీఎం వైఎస్ జగన్ అన్నారు.సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. కొత్త వైద్య కళాశాలల పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలని, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. బిల్డింగ్, నాన్ బిల్డింగ్ సర్వీసులపై అధికారులు సీఎం జగన్‌కు అధ్యయన వివరాలు తెలియజేశారు. ఆస్పత్రుల ఆవరణ కూడా అత్యంత పరిశుభ్రంగా ఉండాలని, ఆస్పత్రుల నిర్వహణపై ఎస్‌ఓపీలను రూపొందించాలన్నారు. ప్రభుత్వాస్పత్రులు కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడాలని, ఎక్కడా ప్రమాణాల విషయంలో వెనక్కి తగ్గకూడదని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్లాన్ కూడా సమర్ధవంతంగా ఉండాలని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రొటోకాల్స్‌పై అధ్యయనం చేయాలన్నారు. అన్ని అంశాలు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్ మరో రికార్డును సాధించింది. గతంలో ఒకేరోజు 6.32 లక్షల డోసులు టీకాలు వేసి దేశంలోనే రికార్డు సృష్టించగా ఆదివారం చేపట్టిన ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్ అంచనాలకు అందని రీతిలో విజయవంతమైంది. తాజాగా ఒక్కరోజే 13,59,300 మందికి టీకాలు వేశారు. దీంతో ఒకేరోజు ఎక్కువ సంఖ్యలో టీకాలు ఇవ్వడంలో ఏపీ తన రికార్డును తానే అధిగమించింది.