న్యూఢిల్లీ, జూన్ 21,
నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ సర్కారుపై తన పోరాటం కొనసాగిస్తున్నారు. అరెస్ట్ తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తన పంథా మార్చుకున్నా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టడంలో మాత్రం వెనక్కి తగ్గట్లేదు. అంతకముందు ప్రతి అంశంపై సోషల్ మీడియాలో లైవ్ పెట్టే ఎంపీ రఘురామ.. కోర్టు ఆదేశాల మేరకు జగన్ సర్కారుపై లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రంలోని 9 అంశాలపై లేఖలు రాస్తానని చెప్పిన రఘురామ.. ఇప్పటికే రాజధానిని అమరావతిలో కొనసాగించాలని కోరారు. ఇందులో భాగంగా సోమవారం ఎంపీ రఘురామ మరో లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలిని రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. సభలో మెజారిటీ ఉన్నప్పుడు శాసన మండలిని రద్దుచేస్తే చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు. గతంలో సభలో మెజారిటీ లేనప్పుడు మండలి రద్దుకు చేసిన తీర్మానం చేశారని, ఇప్పుడు రద్దు చేయకపోవడం ప్రజల్లో సందేహాలు లేవనెత్తిందని అన్నారు. శాసన మండలిలో మెజారిటీ సాధించిన తర్వాత రద్దు చేస్తే ప్రజల్లో ముఖ్యమంత్రి గౌరవం మరింత పెరుగుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. మండలి కొనసాగించడం వృథా అవుతుందని గతంలో ముఖ్యమంత్రి చెప్పిన మాటలను ప్రజలు నమ్మాలంటే తక్షణమే శాసనమండలిని రద్దు చేయాలని కోరారు. క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా మండలి రద్దుకు పార్లమెంటులో తనవంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని మీరు చెప్పే మాటకు కట్టుబడి శాసనమండలిని రద్దు చేయాలని కోరారు.