ముంబై, జూన్ 21,
జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎన్‌సీపీ అధినేతశరద్ పవార్ ప్రతిపక్ష పార్టీలతో సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే, కాంగ్రెస్‌ను మాత్రం ఎన్‌సీపీ ఆహ్వానించకపోవడం గమనార్హం. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో సోమవారం మరోసారి భేటీ అయిన వెంటనే పవార్ ఈ ప్రకటన చేశారు. జూన్ 11న తొలిసారిగా పవార్‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ అయిన విషయం తెలిసిందే. యూపీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో కూటమి ఏర్పాటుపై చర్చించినట్టు తెలుస్తోంది.దీంతో ‘మిషన్ 2024’కోసమే ఇరువురి మధ్య భేటీ జరిగినట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. వీటికి బలాన్నిచ్చేలా శరద్ పవార్‌తో పీకే రెండో సారి సమావేశమయ్యారు. తొలి భేటీలో ఇరువురూ మూడు గంటల పాటు వివిధ అంశాలపై చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం గంటపాటు సమావేశం జరిగింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ లేదా కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మూడో కూటమిని ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ కూటమిలో చేరడానికి చాలా పార్టీలు తమ ఆసక్తిని తెలిపాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.బీజేపీ, దాని అజేయ ఎన్నికల వ్యూహాన్ని తిప్పికొట్టడం సాధ్యమేనని బెంగాల్‌లో ఎన్నికల మమతా బెనర్జీ గెలుపు అత్మవిశ్వాసాన్నిచ్చింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. దాదాపు ఒంటరి పోరాటం చేసిన మమతా.. బీజేపీ ఎత్తుగడలను, ప్రయత్నాలను తిప్పికొట్టి భారీ మెజార్టీతో అధికారాన్ని నిలబెట్టుకున్నారు.బెంగాల్ విజయంతో ప్రస్తుత పరిస్థితిలో మోదీని ఎదుర్కొనే సత్తా మమతా బెనర్జీకి మాత్రమే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మమతా కూడా 2024లో అందరం కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. అటు, శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ సైతం జాతీయస్థాయిలో ప్రతిపక్ష కూటమి ఏర్పాటు అవసరం ఉందన్నారు. ఈ అంశంపై శరద్ పవార్‌తో తాను మాట్లాడినట్టు తెలిపారు.