విజయవాడ, జూన్ 22,
పదవులు దక్కించుకోవడం కనాకష్టంగా ఉన్న వైసీపీలో వాటిని నిలబెట్టుకోవడం అంతే కష్టంగా ఉంది. 2019లో ఏర్పాటైన జగన్ సర్కారులో 24 మంది (సీఎం కాక) మంత్రి పదవులు తెచ్చుకున్నారు. అయితే.. వీరిని రెండున్నరేళ్ల తర్వాత మారుస్తానని.. సీఎం జగన్ ప్రకటించారు. 90 శాతం మంది మంత్రులను మారుస్తానని చెప్పారు. ఇక, ఇప్పటికే రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మరో నాలుగైదు మాసాలే వీరికి ఛాన్స్ ఉంటుంది. దీంతో కొత్తవారు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. అయితే.. ఇప్పుడున్న మంత్రులు తమ పదవులు వదులుకునేందుకు ఇష్టపడడం లేదు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. ఇప్పటి వరకు తాము మంత్రులుగా చలామణి అయినందున.. ఇప్పుడు ఆ పదవులు పోతే ఎలా? అనే బాధ వారిలో కనిపిస్తోంది.మరొకటి.. రెండున్నరేళ్ల కాలంలో వారు తమ తమ నియోజకవర్గాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు. పైగా మంత్రులుగా కూడా వారు సరైన ముద్ర వేయలేక పోయరు. ఈ నేపథ్యంలో మెజారిటీ మంత్రులు తమ పదవులు వదులుకు నేందుకు సిద్ధంగా లేరు. ఈ రెండేళ్లలో తొలి యేడాది మినహాయిస్తే రెండో యేడాది నుంచీ వీరు చేసేందుకు కూడా ఏం లేకుండా పోయింది. మొత్తం కరోనా కాలాహరణం చేసేసింది. కరోనా దెబ్బతో వీరి శాఖల్లో కాదు కదా ? కనీసం వీరు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో పనులు కూడా ఏ మాత్రం ముందుకు సాగలేదు. రెండున్నరేళ్లు మంత్రిగా ఉండి నియోజకవర్గానికి ఏం చేశామంటే చెప్పుకోవడానికి ఏం లేకుండా పోయింది.అలాగని జగన్‌కు చెప్పి ఒప్పించే సాహసం చేయలేరు. ఈ క్రమంలో వారు సరికొత్త లాజిక్‌ను తెరమీదకి తెచ్చారు. “సార్ మీరు మాకు మంచి అవకాశం ఇచ్చారు. కాదనం. కానీ, మేం బాధ్యతలు చేపట్టిన తర్వాత కరోనా కాలం దాపురించింది. దీంతో ఏడాది కాలం వృథా అయింది. ఇక, స్థానిక ఎన్నికలతో మరో ఆరు మాసాల సమయం వృథా అయింది. ఇప్పుడు కూడా కరోనా వెంటాడుతోంది. దీంతో మమ్మల్ని మేం ప్రూవ్ చేసుకోలేకపోయాం. సో.. మాకు మరో ఏడాదైనా సమయం ఇవ్వండి“ అని అభ్యర్థిస్తున్నారట. మరి కొందరు మంత్రుల అభ్యర్థన ప్రస్తుతానికి కీలక సలహాదారుకు చేరిందని తెలిసింది.ఎవరి అభ్యర్థనలు ఎలా ? ఉన్నా జగన్ మాటే ఫైనల్ అవుతుందనడంలో సందేహం లేదు. కేబినెట్లో మళ్లీ మంత్రులుగా కొనసాగాలన్న కోరిక ఉన్న వాళ్లు ఎంత మంది ఉన్నారో ? కేబినెట్లోకి రావాలనుకునే వారి లిస్ట్ అంతకు రెండు, మూడింతలు ఉంది. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.