YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ముందుకు సాగని డ్రోన్ సర్వే

ముందుకు సాగని డ్రోన్ సర్వే

అనంతపురం, జూన్ 22, 
వైఎస్‌ఆర్‌ జగనన్న స్వచ్ఛ భూహక్కు, భూరక్ష' కింద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే ఆచరణలో లక్ష్యాలకు దూరంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వేను 2022 మార్చి కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మండల సర్వేయర్లతోపాటు గ్రామ సర్వేయర్లకు ప్రభుత్వం విడతల వారీ శిక్షణ ఇస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా 13 జిల్లాల్లోని 51 డివిజన్లలో ఒక్కో గ్రామాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా అధికారులు ఎంపిక చేశారు. తదనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 612 గ్రామాలను పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. సర్వే కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ హోదా ఉన్న అధికారిని నోడల్‌ అధికారిగా నియమించింది. సర్వేలో భాగంగా డ్రోన్‌ సర్వేను క్లస్టర్ల వారీ చేపట్టారు. భూసర్వేతోపాటు, భూ రికార్డుల స్వచ్ఛీకరణ (పిఒఎల్‌ఆర్‌) సమాంతరంగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా రికార్డుల స్వచ్ఛీకరణ నడుస్తోంది. అడంగల్‌, ఆర్‌ఎస్‌ఆర్‌, వెబ్‌లాండ్‌ లెక్కలకు రికార్డుల్లోని గణాంకాలు డ్రోన్‌లు తీసిన ఛాయా చిత్రాలకు సరిపోకపోతుండటంతో సర్వే సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. 229 గ్రామాలకు సంబంధించిన పిఒఎల్‌ఆర్‌ పూర్తి కాగా, మరో 45 గ్రామాల డేటా పురోగతిలో ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. నూతనంగా కేటాయించిన 338 గ్రామాలకు 23 గ్రామాల భూ రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తికాగా, మరో 305 గ్రామాల రికార్డుల శుద్ధీకరణ పురోగతిలో ఉంది. పైలెట్‌ ప్రాజెక్టు కింద కేటాయించిన 612 గ్రామాల రికార్డుల స్వచ్ఛీకరణ ఈ నెల 30 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యం ప్రశ్నార్థకంగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డ్రోన్‌ తీసిన ఫొటోలకు, విలేజ్‌ మ్యాప్‌కు భూముల గట్లు, విస్తీర్ణంలో తేడాలు ఎలా పరిష్కరించాలనే అంశంపై ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత ఇవ్వలేదని క్షేత్రస్థాయి సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి విలేజ్‌మ్యాపు, అడంగల్‌, ఆర్‌ఎస్‌ఆర్‌ సరిపోయిన సర్వే నెంబర్లు మాత్రమే సర్వే చేస్తున్నామని, సరిపోని సర్వే నెంబర్లను ప్రస్తుతానికి పక్కనబెట్టి ముందుకు సాగుతున్నట్లు గ్రామ సర్వేయర్లు పేర్కొంటున్నారు. సర్వేకు సంబంధించి రోవర్లు సరిపడినన్ని సరఫరా లేకపోవడం, జంగిల్‌ క్లియరెన్స్‌ లేకపోవడం, ఎక్విప్‌మెంట్‌తోపాటు సరిపడినంత సిబ్బంది లేకపోవడం సర్వే ఆలస్యానికి కారణంగా భావిస్తున్నారు. సర్వే సెటిల్‌మెంట్‌ రికార్డ్సు (ఎస్‌ఎస్‌ఎల్‌ఆర్‌) నివేదిక ప్రకారం చిత్తూరు జిల్లాలో రెండు డివిజన్లలోని 10 మండలాలను పైలెట్‌ సర్వేకు కేటాయించగా, నేటికీ పురోగతి '0'గా ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Related Posts