YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందా

జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందా

హైదరాబాద్, జూన్ 22, 
ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటన సజావుగానే ముగిసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ పర్యటన చేశారంటున్న అధికార పార్టీ అందుకు రానున్న కాలంలో సమకూరిన వనరులను చూపించాల్సి ఉంటుంది. జగన్ ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు తొత్తుగా మారారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. రెండేళ్లవుతున్నా కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను పట్టించుకోక పోయినా జగన్ బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందలేదని భావించి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడనుకుందాం. అయితే ఎన్నేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ఉదాసీనతను భరించాలి? కేంద్రం ఎలాంటి ప్రయోజనాలు రాష్ట్రానికి ఇవ్వకున్నా దానికి అడుగులకు మడుగొలొత్తాలా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. జగన్ రెండేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతిస్తున్నారు. కీలకమైన బిల్లుల్లో సపోర్ట్ చేస్తున్నారు.జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తున్నారు. అయితే దానిపై ఎటువంటి స్పష్టత లేదు. ప్రత్యేక ప్యాకేజీకే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. వెనకపడిన ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ కూడా విడుదల కావడం లేదు. రాష్ట్ర ఆర్థికలోటును కూడా భర్తీ చేయడంలేదు. పోలవరం ప్రాజెక్టుపై కొర్రీలు ఇక మామూలే. అయితే ఇవన్నీ భరిస్తూ జగన్ ఎన్నాళ్లు కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.సోనియాను ఎదిరించి ప్రత్యేక పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ కు ప్రజల్లో ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది. కానీ రెండేళ్లుగా బీజేపీతో అంటకాగుతున్న వైనాన్ని ప్రజలు చూస్తున్నారు. ఆ ఇమేజ్ క్రమంగా పోతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై జగన్ గళమెత్తాల్సిన సమయం ఆసన్నమయిందంటున్నారు. ఎన్నికలకు ముందు ఎన్ని ఫీట్లు చేసినా చంద్రబాబు తరహాలోనే ఇబ్బందులు తప్పవు. ఇప్పటికైనా జగన్ బీజేపీ ప్రభుత్వం పట్ల కరకుగా వ్యవహరిస్తేనే మంచిదన్న సూచనలు విన్పిస్తున్నాయి.

Related Posts