హైదరాబాద్, జూన్ 22,
తెలంగాణ – ఏపీ ల మధ్య నీటి పంచాయితీ రోజు రోజుకు ముదురుతోంది. మొన్న జరిగిన కేబినేట్‌లో ఏపీ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఏపీ తీరు దారుణమని.. దీనిపై కేంద్రం వద్దకు పోవాలని కూడా తెలంగాణ కేబినేట్‌లో చర్చ జరిగినట్లు సమాచారం. అయితే.. దీనిపై ఏపీ కూడా తాజాగా స్పందించింది. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ కెబినెట్లో జరిగిన చర్చపై ఏపీ ఇరిగేషన్ వర్గాలు అభ్యంతరం తెలిపాయి. తెలంగాణ నిర్మిస్తోన్న అక్రమ ప్రాజెక్టుల విషయమై కేంద్రం వద్ద ప్రస్తావించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అనుమతి లేకుండా 8 ప్రాజెక్టుల ద్వారా 178.93 టీఎంసీల నీటిని తరలించేలా కృష్ణా నదిపై 8 ప్రాజెక్టులను నిర్మిస్తోందని గతంలోనే కేంద్రానికి ఫిర్యాదు చేసింది ఏపీ. ఏపీ ప్రాజెక్టులకు కేటాయింపులున్నా నీళ్లవ్వలేని పరిస్థితి ఉందంటోన్న ఇరిగేషన్ శాఖ… ఏపీ కున్న నీటి హక్కుల వినియోగానికే ఆర్డీఎస్ కుడి కాల్వ, రాయలసీమ ఎత్తిపోతల పనులని స్పష్టం చేస్తోంది. తాజా వ్యవహారాల నేపథ్యంలో తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు.. ఏపీ నీటి హక్కులపై వచ్చే కెబినెట్లో ప్రస్తావించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.