విజయవాడ, జూన్ 23,
ఔను! ఈ మాట జాతీయ స్థాయిలో జోరుగా వినిపిస్తోంది. నిజానికి ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్‌కు ఎనలేని గౌరవ మర్యాదలు దక్కాయి. క్షణం తీరికలేని మంత్రులు అందరూ కూడా జగన్‌తో చర్చలు జరిపారు. ఇక, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏకంగా.. జగన్‌ను రాత్రి విందుకు(డిన్నర్) ఆహ్వానించడం.. దాదాపు గంటా 40 నిముషాల సేపు జగన్‌తో కలిసి విందు ఆరగించడం వంటివి ఆసక్తిగా మారాయి. అయితే.. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ మంత్రులు ఇలా ఒక్కసారిగా జగన్ వైపు మొగ్గడానికి .. ఆయనకు అంతసేపు సమయం ఇవ్వడానికి కీలకమైన కారణం ఒకటుంది. దీనిపై ఎవరికి వారు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కొద్ది రోజుల వరకు జగన్ ఢిల్లీ వెళ్లినా బీజేపీ పెద్దలు ఆయన్ను కలిసేందుకు ఏమంత ఆసక్తి చూపేవారు కాదు.తాజా పర్యటనలో జగన్‌కు ఎందుకింత ప్రయార్టీ పెరిగింది ? జగన్‌లో ఈ కొత్త ధీమాకు కారణం ఏంటంటే.. ఇప్పుడు జగన్ అవసరమే బీజేపీకి ఎక్కువ ఉంది. అదే.. రాష్ట్రపతి ఎన్నిక. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే ఏడాది మేనాటికి ముగియనుంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికలకు మరో మూడు నాలుగు నెలల్లో ముహూర్తం రెడీ కానుంది. ఈ నేపథ్యంలో ఎలక్టోరల్ కాలేజీల మద్దతు .. రాష్ట్రపతిగా ఎన్నికయ్యేవారికి చాలా అవసరం. బీజేపీ నాయకుడు అయిన రామ్‌నాథ్ కోవింద్‌నే మరోసారి కూడా ఈ పీఠంపై కూర్చోబెడతారని అంటున్నారు. అయితే.. బీజేపీకి ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు మద్దతు లేదు.అంటే.. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోవడంతో అధికారం కోల్పోయి.. ఎలక్టోరల్ కాలేజీలో ఓట్లు తగ్గాయి. దీనికితోడు ఎన్డీయేలో చాలా పార్టీలు బీజేపీతో విభేదించి బయటకు వచ్చాయి. ఇక రాజ్యసభలో బీజేపీ బలం రోజు రోజుకు తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఆ పార్టీకి పలు కీలక బిల్లుల విషయంలోనూ, ఇటు వాయిస్ వినిపించే విషయంలోనూ చాలా ఇబ్బందులు తప్పవు. ఇక అన్నింటికి మించి మరోసారి రామ్‌నాథ్ కోవింద్ లేదా.. బీజేపీ నిలబెట్టే అభ్యర్థి రాష్ట్రపతి కావాలంటే.. జగన్ వంటి బలమైన పార్టీ మద్దతు అవసరం. దక్షిణాదిలో చూస్తే.. 151 మంది ఎమ్మెల్యేల ఓట్లు, 22 మంది ఎంపీల ఓట్లు ఉన్న ఏకైక పార్టీ జగన్‌దే కావడంతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలోనే జగన్‌కు ఎనలేని ప్రాధాన్యం ఇస్తోందని చెబుతున్నారు.