రాష్ట్రంలో స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు తమదేనని ఆర్కేనగర్ స్వతంత్ర ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ పేర్కొన్నారు. ఆర్కేనగర్‌లోని ఓటర్లకు సోమవారం సాయంత్రం టీటీవీ దినకరన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తండయారుపేటలోని నేతాజీ నగర్ ప్రాంతంలో ఓపెన్‌టాప్ జీపులో పర్యటించారు. ఆయన వెంట ‘అనర్హత’ ఎమ్మెల్యేలు తంగ తమిళ్‌సెల్వన్, వెట్రివేల్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో టీటీవీ మాట్లాడుతూ బస్సు ఛార్జీలు పెంపుతో సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వం పంతానికి పోకుండా బస్సు ఛార్జీల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు. తాను ముఖ్యమంత్రిని ఏక వచనంతో పిలుస్తున్నట్లు మంత్రులు చెబుతున్నారంటూ, వాస్తవానికి ముఖ్యమంత్రే తనను ఏక వచనంతో పిలుస్తున్నారన్నారు. తాను అత్తింటికి వెళ్తానని చెప్పారని, ప్రస్తుతం వారే ఆ పరిస్థితికి లోనయ్యారన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని, ఏ సమయంలోనైనా శాసనసభకు ఎన్నికలు జరగవచ్చని అభిప్రాయపడ్డారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ వర్గానికి ఉమ్మడి గుర్తు అవసరమవుతుందని చెప్పారు. దీంతో కొత్త పార్టీ ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడితే అన్నాడీఎంకే సభ్యులుగా ఉన్న వెంట్రివేల్, తంగ తమిళ్‌సెల్వన్ ఆ పార్టీలో ఎలా చేరుతారని ప్రశ్నించారు. అందువల్ల బయటి నుంచి మద్దతిస్తామని వారు స్పష్టం చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించి జయలలిత నిజమైన రాజకీయ వారసులు తామేనని నిరూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నటులు రజనీకాంత్, కమల్‌హాసన్ రాజకీయ ప్రవేశం తమకు తిరోగమనం కలిగించదన్నారు. నెంబరు ఒన్ ఎవరనే విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని, ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా విజయం సాధిస్తామని పేర్కొన్నారు. ప్రజలు తమకు మద్దతు ఇస్తారని, అందువల్ల ఎవరితోనూ తమకు ఇబ్బందిలేదన్నారు.