న్యూఢిల్లీ, జూన్ 23,
మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం డిజిటల్ ప్లాట్ ఫామ్ గా కొవిన్ సైట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించిన సమాచారం మొత్తం ఉంటుంది. అయితే ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద 20దేశాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. వారి దేశాల్లో కూడా దీన్ని ఆధారంగా చేసుకుని డిజిటల్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేయాలని చూస్తున్నాయి.ఈ విషయాన్ని వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్‌కు చైర్మన్‌గా ఉన్న డాక్టర్ ఆర్.ఎస్ శర్మ వివరించారు. ఇరాక్, పెరూ, వియత్నాం, దుమాయ్, పనామా లాంటి దేశాలు తమను సంప్రదించాయని, కొవిన్ సైట్ టెక్నాలజీ గురించి వివరాలు తెలుసుకునేందుకు ఆయా దేశాలు ముందుకొచ్చినట్టు వివరించారు.ప్రస్తుతం దేశంలో జరుగుతున్న మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ మొత్తం కొవిన్ పోర్టల్ ద్వారానే ఆర్గనైజ్ చేస్తున్నట్టు శర్మ వివరించారు. వ్యాక్సినేషన్‌లో అన్ని వివరాలను తెలుసుకునేందుకు సెంట్రల్ ఐటీ ద్వారా కొవిన్ పోర్టల్‌ను ఏర్పాటు చేశామన్నారు. సమాచారాన్ని దేశవ్యాప్తంగా తెలుసుకోవడానికి ఈ పోర్టల్ వెన్నెముకగా ఉందన్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ కోసం అందరూ ఇందులోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని, ఇప్పటికీ వందకోట్ల మంది వరకు పోర్టల్‌న విజిట్ చేసినట్టు వివరించారు.