YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

*ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్*

*ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్*

*కర్ఫ్యూ సడలింపు నేపథ్యంలో నిర్లక్ష్యం వద్దు - కరోనా జాగ్రత్తలు పాటిద్దాం!*
దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మన రాష్ట్రంలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూను మరింత సడలించారు. ప్రస్తుతం ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ప్రజలు తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా యథావిధిగా పనిచేస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. కరోనా నుంచి పూర్తిస్థాయి రక్షణకు మరికొంత సమయం పట్టడం ఖాయం. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా పూర్తిగా తగ్గిందని భావించకూడదు. కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న ఈ నేపథ్యంలో ప్రజలు  ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తప్పనిసరిగా మాస్కు ధరించడం, బయటకు వెళ్లినపుడు భౌతిక దూరం పాటించడం, తరచూ సబ్బుతోగానీ శానిటైజర్ తో గానీ చేతులను శుభ్రం చేసుకోవడం మరవకూడదు. ఇందుకోసం మన పాటించాల్సిన ముఖ్యమైన విధానం ఎస్.ఎం.ఎస్ ( సబ్బు/శానిటైజర్, మాస్కు, సోషల్ డిస్టెన్స్). కోవిడ్-19 ను ఎదుర్కొనడానికి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఆయుధాల్లో ఈ ఎస్.ఎం.ఎస్ విధానం అతి ముఖ్యమైనది.
*మాస్కు ధరించడం*
కరోనాను మన నుంచి ఇతరులకు, ఇతరుల నుంచి మనకు వ్యాప్తి చెందకుండా ఉంచే మార్గాల్లో మాస్కు ధరించడం కీలకమైనది. ప్రతిఒక్కరూ మాస్కు పెట్టుకోవడం ద్వారా కోవిడ్ వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని నిపుణులు కూడా సూచిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాయి. ప్రభుత్వం కర్ఫ్యూ, లాక్డౌన్ అంటే నియంత్రణలు విధిస్తేనే ప్రజలు కూడా మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది మాస్కులు లేకుండా బయటకు రావడం చూస్తూనే ఉన్నాం. ఇలా చేయడం వల్ల మనతోపాటు మన పక్కన ఉండేవారికి కూడా ఇబ్బందుల్లోకి నెట్టినట్టే. అందుకే ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మూడు లేయర్ల మాస్క్ కానీ, ఇంట్లో తయారు చేసిన మాస్క్ కానీ ధరించాలి. మాస్కును ప్రతిరోజూ మారుస్తూ ఉండాలి. మాస్కును ఉతికిన తర్వాత ఎండలో ఆరబెట్టాలి. 
*భౌతిక దూరం*
కరోనాను ఎదుర్కోనేందుకు మన దగ్గరున్న మరో ఆయుధం భౌతిక దూరం. ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే తప్పనిసరిగా ఎదుటి వ్యక్తికి కనీసం ఆరు అడుగులు లేదా 2 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కూరగాయల మార్కెట్‌లోను, కిరాణా షాపులకు వెళ్లినపుడు, మెడికల్ షాపులకు వెళ్లినపుడు, ఆఫీసులో పనిచేసే సమయంలో, ప్రయాణ సమయంలో, ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి.
*సబ్సు లేదా శానిటైజర్*
మనం పనిచేసుకుంటున్న ప్రదేశంలోగానీ, ఇంట్లో గానీ, బయట కూరగాయలకు వెళ్లినపుడు, మెడికల్ షాపులకు వెళ్లినపుడు ఇలా అనేక సార్లు మన చేతులతో ఎన్నో వస్తువులను తాకుతూ ఉంటాం. అవే వస్తువలను మనకు తెలియకుండా ఎంతోమంది తాకి ఉంటారు. అందువల్ల కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇంటికి రాగానే సబ్బు అయితే కనీసం 20 సెకన్ల నుంచి 40 సెకన్లపాటు మన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. వంట వండే ముందూ, వండిన తర్వాత, ఆహారం తీసుకునేటప్పుడు, తీసుకున్న తర్వాత, మాంసం, చేపలూ మొదలయిన నాన్ వెజ్ పదార్థాలు శుభ్రం చేసేటప్పుడు, పిల్లలకు ఆహారం పెట్టే ముందు ఇలా ప్రతిసారి సబ్బుతోనూ, నీళ్లతోనూ చేతులు శుభ్ర పరుచుకోవాలి. ఒకవేళ బయటకు వెళ్లినట్టయితే తప్పనిసరిగా శానిటైజర్ దగ్గర ఉంచుకోవడం మరవకూడదు. 
*రద్దీ ప్రాంతాలు.. వైరస్ అడ్డాలు* 
కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూకు సడలింపులు ఇచ్చింది. దీంతో రద్దీగా ఉండే ప్రదేశాలకు ముఖ్యంగా కూరగాయల మార్కెట్లు, కిరాణా షాపులు, మాంసం దుకాణాలు, వైన్ షాపుల దగ్గర ఇప్పుడు కూడా గతంలోలాగే విపరీతమైన రద్దీ ఉంటోంది. ఇలాంటి రద్దీ ప్రదేశాలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్లకపోవడం మంచిది. ఎందుకంటే అక్కడే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే మాస్కు ధరించడం, ఇతరులకు భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కిరాణా షాపుల దగ్గర గుంపులుగా, మందుల షాపుల దగ్గర జనం ఎక్కువగా ఉండే అకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓపిక అవసరం. కొంతసేపు కూడా ఆగలేక తోసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల మనిషికి మనిషికి మధ్య కనీస దూరం లేకుండాపోతోంది. ఫలితంగా ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారు.
*మరికొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు:*
* టిఫిన్, టీ, ఫ్రూట్ జ్యూస్ సెంటర్ల దగ్గర ఎప్పటిలాగే రద్దీ ఉంటోంది. ఎక్కడా కనీసం భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు పెట్టుకున్నా తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఫ్యాషన్ గా మాస్కులు ముఖానికి తగిలించుకుని నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు.
* బయట తిండి, టీ, చాట్ మసాలాలు, బిర్యానీలు తినకపోవడం మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట తిండి తినడం వల్ల కరోనాను మనమే స్వయంగా ఆహ్వానిస్తున్నట్టు లెక్క.
* కరోనాకి ఎవరూ అతీతులు కాదు. రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ మరింత తీవ్రంగా ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా మనవరకు రాలేదని ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. అది మన బాధ్యతారాహిత్యాన్ని, విచ్చల విడితనాన్ని తెలియచేస్తుంది.
* ఇప్పుడిప్పుడే కరోనా రెండో దశ తగ్గుతూ ఉన్న నేపథ్యంలో వస్త్రంతో చేసిన మాస్కు కన్నా భద్రమైన సర్జికల్ మాస్కు లేదా ఎన్95 మాస్కు వాడడం మంచిది.
* కళ్లను పూర్తిగా కప్పి ఉంచే కళ్లజోడు వాడితే మరింత భద్రం.
* ద్విచక్ర వాహనదారులు తలను పూర్తిగా కప్పి ఉంచేలా హెల్మెట్ ధరించి దానికి ముందు అద్దం వేసుకుంటే చాలా వరకు భద్రంగా ఉంటారు. తలపై, జుట్టుపై వైరస్ అంటుకునే ప్రమాదం చాలా వరకు తప్పుతుంది.
* ప్రతి ఒక్కరూ నెలకు సరిపడా నిత్యావరసరాలు ఒక్కసారే తెచ్చుకోండి. ఒకటి అర కావాల్సి వచ్చినా అవి అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి.
* పట్టణాల్లో అయితే చాలా షాపుల యజమానులు డోర్ డెలివరీ కోసం వాట్సాప్ నంబర్లు ఇస్తున్నారు. వీలైనంత వరకు ఆ సౌకర్యాన్ని వినియోగించుకుంటే షాపుల దగ్గర రద్దీ తగ్గుతుంది.
* అవకాశం ఉన్నవారు పెద్దపెద్ద షాపులకు వెళ్లకుండా ఆన్ లైన్ ద్వారా సరుకులు బుక్ చేసుకుని తెప్పించుకోవడం మరింత ఉత్తమం.
* రైతు బజార్లలో కూరగాయలు తక్కువ రేటుకు దొరుకుతాయని ఆశపడవద్దు. ప్రస్తుతం రోడ్ల పక్కన చాలా చోట్ల కూరగాయల షాపులు ఉంటున్నాయి. రేటు కొంచెం ఎక్కువైనా రద్దీలేని షాపుల దగ్గర కొనడం మంచిది. తక్కువ రేటు ఉంటాయని రైతు బజార్లకు వెళితే వైరస్ ను మీతోపాటు మీ ఇంటికీ ఆహ్వానించిన వారు అవుతారు.
* మానసిక వికాసానికి మంచి పుస్తకాలు చదవడం, ఆహ్లాదాన్నిచ్చే కార్యక్రమాలను టీవీలో చూడడం మంచిది.
==========
*డాక్టర్ అర్జా శ్రీకాంత్*
*స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19* 

Related Posts