న్యూఢిల్లీ జూన్ 23 : ఇండియా ఈ మధ్యే కరోనా ఆందోళనకర వేరియంట్‌గా గుర్తించిన డెల్టా ప్లస్ కేసులు దేశంలో 40కిపైగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఈ కేసులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ రాష్ట్రాలకు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఈ రాష్ట్రాలకే ఈ వేరియంట్ పరిమితం కాలేదని, ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్రలో 21, మధ్యప్రదేశ్‌లో ఆరు, కేరళ, తమిళనాడుల్లో మూడు, కర్ణాటకలో 2, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లలో ఒక్కో కేసు ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. డెల్లా ప్లస్ వేరియంట్ కేసులు ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నా.. దేశంలో ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్లు ఎత్తేస్తుండటంతో ఈ కేసులు ఎక్కువయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. డెల్టా ప్లస్ కేసులు మహారాష్ట్రలోని రత్నగిరి, జల్‌గావ్.. కేరళలోని పాలక్కడ్, పతనమితిట్ట.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, శివ్‌పురిలలో ఉన్నాయి. తమ రాష్ట్రంలో ఈ కేసులు వచ్చిన ప్రాంతాల్లోని వ్యక్తులు ఎక్కడెక్కడ తిరిగారు, వాళ్ల వ్యాక్సినేషన్ పరిస్థితి ఏంటన్నదానిపై వివరాలు సేకరిస్తున్నట్లు మహారాష్ట్ర తెలిపింది. డెల్టా వేరియంట్‌లాగే ఇది కూడా చాలా వేగంగా వ్యాపించే వేరియంట్. ఇప్పటికే 9 దేశాలకు ఇది పాకినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో డెల్టా వేరియంట్ 80 దేశాలకు పాకిన విషయం తెలిసిందే. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాక్సిన్‌వనూ బోల్తా కొట్టిస్తున్నాయని, ప్రస్తుత చికిత్సకూ అందడం లేదన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.