న్యూఢిల్లీ,జూన్ 23
కేంద్ర ప్రభుత్వం మరో రెండు బ్యాంకులను ప్రయివేటీకరించాలని నిర్ణయించింది. ప్రయివేటీకరించేందుకు నీతి అయోగ్ ఇటీవల పలు బ్యాంకులను సిఫార్సు చేసింది. తాజాగా ఆ జాబితా నుంచి రెండు బ్యాంకులను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. సెంట్రల్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల ప్రయివేటీకరణకు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించి నిర్ణయం వెలువడనున్నది.ప్రభుత్వరంగంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ)ల యాజమాన్యం త్వరలో చేతులు మారనున్నాయి. ప్రయివేటీకరణలో భాగంగా ఈ రెండు బ్యాంకుల ఈక్విటీలో తొలుత 51 శాతం వాటాను ప్రయివేటు సంస్థలకు విక్రయించాలని నీతి ఆయోగ్ సిఫార్స్ చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలోని కార్యదర్శుల కమిటీ ఈ విషయాన్ని పరిశీలిస్తున్నది. ఈ కమిటీ సిఫార్సు ఆధారంగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనున్నది.