పుణె జూన్ 23
కరోనా థర్డ్ వేవ్ వస్తుందని, అది పిల్లలపైనే ప్రధానంగా ప్రభావం చూపుతుందన్న వార్తల నేపథ్యంలో కాస్త ఊరట కలిగించే విషయం చెప్పారు పుణెకు చెందిన పరిశోధకులు. తట్టు (మీజిల్స్) రాకుండా ఉండటం కోసం పిల్లలకు వేసే వ్యాక్సిన్ వల్ల కొవిడ్ నుంచి కూడా రక్షణ లభిస్తున్నట్లు వీళ్ల పరిశోధనలో తేలింది. ఒకవేళ ఈ వ్యాక్సిన్ వేసుకున్న పిల్లలకు కొవిడ్ సోకినా.. దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటున్నట్లు కూడా స్పష్టమైంది.పుణెలోని బీజే మెడికల్ కాలేజీ ఈ అధ్యయనం నిర్వహించింది. కరోనా వైరస్‌పై మీజిల్స్ వ్యాక్సిన్ 87.5 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. హ్యూమన్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునోథెరప్యూటిక్స్ జర్నల్‌లో ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించారు. పిల్లల్లో మీజిల్స్ వ్యాక్సిన్ కొవిడ్ నుంచి దీర్ఘకాల రక్షణ కూడా అందిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. అయితే దీనిపై మరిన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.ప్రపంచంలో ఇలాంటి అధ్యయనం ఇదే తొలిసారి. మేము ప్రధానంగా ఎంఎంఆర్ వ్యాక్సిన్లపైనే దృష్టి సారించాం. ఎందుకంటే కొవిడ్‌లోని అమినో యాసిడ్ సీక్వెన్స్ రూబెలా వైరస్‌లోని దాంతో 30 శాతం పోలిక ఉంది. ఇక కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్ కూడా మీజిల్స్ వైరస్‌లోని హెమాగ్లుటినిన్ ప్రొటీన్‌లాగే ఉంది. అందుకే వాటిపై అధ్యయనం చేశాం. ఫలితాలు సానుకూలంగా వచ్చాయి అని రీసెర్చర్లలో ఒకరైన డాక్టర్ నీలేష్ గుజార్ వెల్లడించారు.ఇక ఈ ఎంఎంఆర్ వ్యాక్సిన్ పిల్లల్లో కొవిడ్ సృష్టించే సైటోకైన్ స్టార్మ్‌లను కూడా అడ్డుకోవడంలో సాయం చేస్తాయనీ తేలినట్లు చెప్పారు. అందుకే ఈ మీజిల్స్ వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు వెంటనే తీసుకోవాలని, తొలి డోసు తీసుకున్న వారు కూడా రెండో డోసు తీసుకోవాలని సూచించారు.
అధ్యయనం ఎలా చేశారు?
ఇండియాలో పిల్లలకు 9-12 నెలల మధ్య వయసులో తొలి డోసు, 16-24 నెలల వయసులో రెండో డోసు మీజిల్స్ వ్యాక్సిన్ ఇస్తారు. అధ్యయనంలో భాగంగా ఏడాది నుంచి 17 ఏళ్ల వయసున్న 548 పిల్లలను పరిశీలించారు. వీళ్లను రెండు గ్రూపులుగా విడదీశారు. ఇప్పటికే కొవిడ్ పాజిటివ్‌గా తేలిన వాళ్లు, ఇప్పటి వరకూ దాని బారిన పడని వాళ్లను వేర్వేరు గ్రూపులుగా చేశారు.వీళ్లలో మీజిల్స్ వ్యాక్సిన్లు తీసుకొని కొవిడ్ బారిన పడిన వాళ్లలో చాలా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తేలింది. అదే వ్యాక్సిన్ తీసుకోని వాళ్లలో కొవిడ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి అని అధ్యయనం తేల్చింది. మీజిల్స్, బీసీజీ వంటి వ్యాక్సిన్లు పిల్లలకు కొవిడ్ నుంచి రక్షణ కలిగిస్తున్నట్లు పలువురు పరిశోధకులు భావిస్తున్న నేపథ్యంలో ఈ అధ్యయనం ఆ దిశగా తొలి అడుగు వేసింది.