విజయవాడ, జూన్ 24,
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన స్థాయి ఆయనకు అర్థమయిందనే అనుకోవాలి. కర్నూలు జిల్లా పర్యటనలో నారా లోకేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. దీంతో వైసీపీ నేతలు నారా లోకేష్ పై మాటల దాడికి దిగారు. లోకేష్ పై మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకూ వార్నింగ్ లు ఇచ్చారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకూ వైసీపీ నేతలు నారా లోకేష్ పై ఫైర్ అయ్యారు.
అయితే ఇదే సమయంలో నారా లోకేష్ పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేతలు ఎవరూ పట్టించుకోలేదు, కనీసం ఖండించనూ లేదు. నారా లోకేష్ కు అండగా నిలబడాలన్న ఆలోచన సీనియర్ నేతలకు ఎవరికీ కలగలేదు. దేవతోటి నాగరాజు, దివ్వవాణి వంటి నేతలు మాత్రం ఖండించారు. వీరికి ప్రజల్లో పెద్దగా ప్రజాదరణ లేదు. ఇంతకీ నారా లోకేష్ విషయంలో సీనియర్ నేతలు ఎవరూ జోక్యం చేసుకోకపోవడానికి కారణాలపై చర్చ జరుగుతోంది.నారా లోకేష్ మంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి సీనియర్లను పక్కన పెట్టారు. తన కంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకునేందుకు ఆయన ఎక్కువ సమయం కేటాయించారు. అప్పుట్లో సీనియర్ మంత్రుల శాఖల విషయంలో కూడా నారాలోకేష్ జోక్యం చేసుకున్నారని తెలిసింది. అప్పట్లో హోంమంత్రిగా ఉన్న నిమ్మకాయల చినరాజప్ప తప్పమ మిగిలిన అందరూ లోకేష్ వ్యవహార శైలిని అంతర్గతంగా తప్పు పట్టిన వారే.ఇప్పుడు పార్టీ ఓటమి తర్వాత కూడా పార్టీ వ్యవహారాల్లో, జిల్లా రాజకీయాల్లో నారా లోకేష్ జోక్యం ఎక్కువయిందంటున్నారు. జిల్లాలో తన వర్గం నేతలకు నేరుగా ఫోన్ చేసి ఆయన మాట్లాడుతుండటం పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు రుచించడం లేదు. తమకు లోకేష్ బాబు ఫోన్ చేశారని వారు చెబుతుంటే సీనియర్లు విస్మయం చెందుతున్నారట. అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి. అందుకే లోకేష్ పై వైసీపీ నేతలు మాటల దాడి చేస్తున్నా సీనియర్లు నోరు మెదపకపోవడానికి వారిలో ఉన్న అసంతృప్తే కారణమంటున్నారు.