ముంబై, జూన్ 24,
మార్కెట్లో అన్ని ప్రొడక్ట్‌ల ధరలు పెరుగుతున్నాయి. ఎకానమీ రికవరీ బాట పడుతోందని సంబరపడే లోపే, ఇన్‌ఫ్లేషన్ దానిపై నీళ్లు జల్లుతోంది. తాజాగా వంట నూనె నుంచి కంది పప్పు, శనగ పప్పు వరకు ధరలు పెరగడాన్ని చూశాం. కిందటి నెల కేజి సన్ ఫ్లవర్ ఆయిల్(ప్యాకేజ్డ్) రిటైల్ ధర సగటున రూ. 174 పలికింది. ముందు ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే ఈ ఆయిల్ ధర ఏకంగా 56 శాతం పెరిగింది. స్టీల్, కాపర్ వంటి కమోడిటీ ధరలకైతే అడ్డేలేకుండా పోయింది. క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 70 డాలర్లను క్రాస్ చేసింది. ఏడాది కిందటి ధరతో పోలిస్తే ఏకంగా డబుల్ అయ్యింది. ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చులు పెరుగుతుండడంతో ప్రొడక్ట్‌ల ధరలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో హోల్ సేల్ ఇన్‌ఫ్లేషన్ 12.94 శాతం వద్ద గరిష్టాన్ని టచ్ చేసింది. అలానే రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 6.3 శాతానికి పెరిగింది. ముందు నెలలో ఇది కేవలం 4.3 శాతంగానే ఉంది. ‘ముందు వారానికి రూ. 300–400 ఖర్చయ్యేది. ఇప్పుడు రూ. 600–రూ.800 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. కూరగాయలు, వంటనూనెలు వంటి కిచెన్ సామాన్ల కోసమే నెలకు రూ. 6,000 నుంచి రూ. 10,000 కేటాయించాల్సి వస్తోంది’ అని హైదరాబాద్‌కు చెందిన ఓ హౌస్‌వైఫ్ పేర్కొన్నారు. గ్లోబల్‌గా ఎకనామీ రికవరీ అవుతుండడంతో మెటల్స్ ధరలు పెరుగుతున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. యూఎస్‌లో కూడా ఇన్‌ఫ్లేషన్ 5 శాతాన్ని టచ్ చేసిందని, ఇది గత 30 ఏళ్లలో మొదటి సారని పేర్కొన్నారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ చర్యలు తీసుకున్నా, ఇప్పటికిప్పుడు రేట్లు దిగొచ్చే అవకాశమయితే కనిపించడం లేదు. అందుకే ఇన్‌ఫ్లేషన్ పెరిగిందని గుర్తించి, దానికి తగ్గట్టు ఇంటి బడ్జెట్‌ను రెడీ చేసుకోవాలని నిపుణులు సలహాయిస్తున్నారు. అంతేకాకుండా, ఇన్‌కమ్ వచ్చే ఇతర మార్గాలను ఫాలో కావాలని చెబుతున్నారు.
ఇన్‌ఫ్లేషన్ పెరిగితే డబ్బుల విలువ తగ్గిపోతుంది. సేవింగ్స్ కరిగిపోతాయి. ఇలా కాకుండా ఉండాలనుకుంటే, ఇన్‌ఫ్లేషన్ పెరిగేంత వేగంగా ఇన్‌కమ్ కూడా పెరగాలి. లేదా చేస్తున్న ఖర్చులు మరింత తగ్గించుకోవాలి. ఇన్‌ఫ్లేషన్‌ను ఎలా ఎదుర్కోవాలో చూద్దాం.పెరుగుతున్న ఇన్‌ఫ్లేషన్‌కు తగ్గట్టు ఇంటి బడ్జెట్‌ను రెడీ చేసుకోవాలి. సేవింగ్స్ ఖర్చవ్వకుండా ఉండాలంటే, చేస్తున్న ఖర్చులపై ఫుల్ గ్రిప్ ఉండాలి. నెల జీతంలో 70 శాతం వరకు మాత్రమే నెలవారి ఖర్చుల కోసం కేటాయించుకోవాలని మైమనీమంత్రా ఫౌండర్ రాజ్ ఖోస్లా అన్నారు. ఇలా చేస్తే రేట్లు పెరుగుతున్నా, కొంత సపోర్ట్ ఉంటుందని చెప్పారు. పేపర్లలో, న్యూస్‌లో వచ్చే ఇన్‌ఫ్లేషన్ రేటు కంటే ఎక్కువగా రేట్ల పెరుగుదల ఉంటుందని అంచనావేసుకోవాలని ఎనలిస్టులు చెబుతున్నారు. పెద్ద పెద్ద ఖర్చులను ముందుగా అంచనావేసి, దానికి తగ్గట్టు ప్లాన్స్ వేసుకోవాలని చెబుతున్నారు. సిస్టమ్‌లో ఇన్‌ఫ్లేషన్ పెరిగితే బ్యాంకుల వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. చాలా బ్యాంకులు బారోవర్లు కట్టే ఈఎంఐలో మార్పు చేయడానికి ఇష్టపడవు. దీనికి బదులుగా లోన్ పిరియడ్‌ను పొడిగిస్తాయి. అందుకే ఇన్‌ఫ్లేషన్ మరింత పెరగక ముందే, ఏవైనా లోన్ బకాయిలుంటే తీర్చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఎంతో కొంత ముందు కట్టి లోన్ బకాయిలను తగ్గించుకోమని చెబుతున్నారు. ఎస్‌బీఐ హోమ్ లోన్లపై వడ్డీ రేటును ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 6.95 శాతానికి పెంచింది. ముందు 6.7 శాతానికే ఆఫర్ చేసింది. ఇలానే మిగిలిన ఫైనాన్షియల్ సంస్థలు కూడా వడ్డీ రేట్లను పెంచాలని చూస్తున్నాయి. ఈ ఏడాది హోమ్ లోన్లు కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. కానీ, ఇప్పటికే లోన్లను తీసుకున్న చాలా మంది బారోవర్లు పాత రేటుకే లోన్లను చెల్లించాల్సి వచ్చింది. ఇలాంటి వారు తమ లోన్లను కొత్త లెండర్‌కు ట్రాన్సఫర్ పెట్టుకోవాలని నిపుణులు సలహాయిస్తున్నారు. వడ్డీ ఖర్చు తగ్గుతుందనుకుంటే హయ్యర్ ప్రాసెసింగ్ ఛార్జీ ఉన్నా, మారిపోవడం బెటర్ అని చెబుతున్నారు. పెరుగుతున్న ఇన్‌ఫ్లేషన్‌కు తగ్గట్టు ఆదాయం వచ్చే అసెట్స్‌లలో ఇన్వెస్ట్ చేయాలని ఫైనాన్షియల్ ప్లానర్స్ సలహాయిస్తున్నారు. నెల జీతంలో కనీసం 30 శాతాన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం కేటాయించాలని పేర్కొన్నారు. మిగిలిన అన్ని అసెట్స్‌తో పోలిస్తే, ఈక్విటీ మార్కెట్లో రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా, మార్కెట్లు లాభపడుతుండడాన్ని చూస్తున్నాం. ప్రొఫెషనల్స్ సలహా తీసుకొని, ఆదాయంలో కొంత వాటాను ఇన్వెస్ట్‌మెంట్ కోసం వాడుకోవాలి. గోల్డ్, బాండ్లు వంటి అసెట్స్‌ను కూడా ప్రయత్నించొచ్చు. వీటి కంటే తక్కువ రిటర్న్సే వచ్చినా, ఫిక్స్డ్ డిపాజిట్, ప్రావిడెంట్ వంటివి వివిధ స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా ఇన్‌కమ్ పెంచుకోవచ్చు.