YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

మార్కెట్ ను ముంచెత్తుతున్న నకిలీ విత్తనాలు

మార్కెట్ ను ముంచెత్తుతున్న నకిలీ విత్తనాలు

విజయవాడ, జూన్ 24, 
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు అలా ప్రవేశించాయో లేదో మళ్లీ నకిలీ విత్తనాల మకిలీ అంటుకుంది. ప్రతి సంవత్సరం మాది రిగానే ఈ వానాకాలంలోనూ ఈ మాయదారి విత్తనాల ముప్పు పొంచి ఉందని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్, పాలమూరు జిల్లాల్లో సోయాబీన్, కంది రైతాంగానికి నకిలీల బెడద పట్టుకోగా, ఇప్పుడిప్పుడే విత్తనాల కొనుగోళ్లు ప్రారంభించిన పత్తి రైతు కూడా ఈ నకిలీల బారిన పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ వానాకాలంలోనూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోతే అందరి కళ్లుగప్పి రాష్ట్రంలో ప్రతియేటా చెలామణి అయ్యే నకిలీ విత్తన మాఫియా యథేచ్ఛగా తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.70 లక్షల ఎకరాల్లో రైతులు సోయాబీన్‌ సాగు చేస్తుంటారు. ఇందులో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఎక్కువ సాగవుతుంది. ఇందుకు గాను 1.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ, ప్రభుత్వం వద్ద 18 వేల క్వింటాళ్లే అందుబాటులో ఉండటంతో మిగిలిన విత్తనాల కోసం రైతులు వ్యాపారుల మీద ఆధారపడాల్సి వస్తోంది. దీంతో తెలంగాణ సీడ్స్‌ సంస్థ నిజామాబాద్‌ జిల్లాలోని పలు పీఏసీఎస్‌ల ద్వారా రెండు, మూడు రకాల కంపెనీల సోయాబీన్‌ విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేసింది. ఇందులో, వీకేర్‌ అగ్రిటెక్, అక్షయ అగ్రిటెక్‌ జేఎస్‌335 రకాల విత్తనాలు 10 నుంచి 15 శాతం కూడా మొలకెత్తలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇవి నకిలీవేనని బల్లగుద్ది చెబుతున్నాయి.ప్రభుత్వ సంస్థలే మొలకెత్తని విత్తులను రైతులకు అంటగడితే పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నాయి. ఇక పాలమూరు జిల్లాలో కంది విత్తన మాఫియా తన కార్యక్రమాలను ప్రారంభించింది. అలంపూర్‌ ప్రాంతంలో కాలం చెల్లిన కంది విత్తన ప్యాకెట్లు బయటపడ్డట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది మార్చిలో పరీక్షించి 2019 నవంబర్‌ వరకు మాత్రమే గడువున్న విత్తనాలను ప్రస్తుతం రైతులకు అంటగడుతున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇవి కూడా పీఏసీఎస్‌ల ద్వారానే సబ్సిడీపై ఇస్తున్నారని, సొసైటీల్లో ఇచ్చే విత్తనాలే ఇలా ఉంటే ప్రైవేటు కంపెనీల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. జర్మినేషన్‌ పూర్తిస్థాయిలో లేకుండానే విత్తనాల గడువు తేదీలను మార్చి అవే విత్తనాలను రీసైక్లింగ్‌ చేసి మార్కెట్‌లో అమ్ముతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాస్‌్కఫోర్స్‌ అధికారులు ఏం చేస్తున్నారంటూ రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.నియంత్రిత వ్యవసాయంలో భాగంగా పత్తి సాగు పెంచాలని, రైతులను ఆ మేరకు ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానంలో స్పష్టంగా పేర్కొంది. దీంతో గతేడాది కంటే ఏకంగా 10 లక్షల ఎకరాల వరకు అదనంగా పత్తి సాగు పెంచాలని నిర్ణయించింది. అందుకోసం వ్యవసాయశాఖ అధికారులు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. అయితే పెరిగే పత్తి సాగును ఆధారం చేసుకొని రైతులను మోసం చేసేందుకు అక్రమార్కులు సన్నాహాలు చేసుకుంటున్నారు. నకిలీ విత్తనాలను అంటగట్టడం, నిషేధిత బీజీ–3 విత్తనాలను విక్రయించడం వంటి చర్యలకు పాల్పడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. గతంలో కూడా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో పత్తి, మిర్చి పంటలకు సంబంధించి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను విక్రయించడంతో రైతులు నష్టపోయిన అనుభవాలున్నాయి. అయితే, ఈ సందర్భాల్లో విత్తన కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగా యథేచ్ఛగా మళ్లీ మార్కెట్‌లోకి నకిలీ విత్తనాలు వచ్చేందుకు ఆస్కారం ఏర్పడిందని, అప్పట్లో విత్తులు అమ్మిన వ్యాపారుల నుంచి విత్తనాల రేటుకు డబుల్‌ రేటు రైతులకు ఇప్పించి వ్యవసాయ శాఖ చేతులు దులుపుకుందని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా వాణిజ్య పంటల విత్తనాలు నాణ్యత ఉండేలా తగిన జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోవాలని వారు కోరుతున్నారు.ఆరేళ్లలో పత్తి సాగు విస్తీర్ణం ఏడాదికేడాదికి పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచడం వల్ల కూడా సాగు పెరిగిందని అంచనా వేస్తున్నారు. పత్తి మద్దతు ధర పెరుగుతుండటంతో రైతుల్లో ఆశలు మరింత రేకెత్తాయి. దీంతోపాటు ఉత్పత్తి కూడా అమాంతం పెరుగుతుండటం గమనార్హం. సకాలంలో వర్షాలు కురవడం వల్లే దిగుబడులు మరింత పెరుగుతున్నాయని వ్యవసాయ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2014–15లో పత్తి 42.32 లక్షల ఎకరాల్లో సాగైతే, 18.44 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి వచ్చింది. గతేడాది ఏకంగా 54.45 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ ఏడాది ప్రభుత్వం దాన్ని ఏకంగా 65 లక్షల ఎకరాలకు పెంచాలని నిర్ణయించింది. అంటే అదనంగా 10.54 లక్షల ఎకరాలు ఈ ఏడాది సాగు కానుంది. అందుకోసం ఈసారి పత్తి విత్తన ప్యాకెట్లు 1.30 కోట్లు అవసరం పడతాయని అంచనా వేశారు. దీనికి అదనంగా మరో 10 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని కూడా అంటున్నారుఅయితే ఇప్పటివరకు దేశంలో బీజీ–1, బీజీ–2 పత్తి విత్తనానికి మాత్రమే అనుమతి ఉంది. బీజీ–2 పత్తి విత్తనం వేస్తున్నా గులాబీరంగు పురుగు ఆశిస్తుండటంతో బీజీ–3 రంగప్రవేశం చేసింది. బీజీ–2కు బీజీ–3 పత్తి విత్తనానికి తేడా గుర్తించలేని పరిస్థితి ఉండటంతో దీన్నే అవకాశంగా తీసుకొని కంపెనీలు, వ్యాపారులు నిషేధిత బీజీ–3ని రైతులకు అంటగడుతున్నారు. ఏడాదికేడాది బీజీ–3 సాగు చాపకింద నీరులా పెరుగుతోంది. రాష్ట్రంలో పత్తి చేలల్లో బీజీ–3 ఉన్నట్లు గతంలోనే నిర్ధారణకు వచ్చారు. అయితే మనదేశంలో బీజీ–3కి అనుమతి నిరాకరించడంతో దీన్ని అడ్డదారిలో విస్తరించే పనిలో కంపెనీలు నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులు, దళారులను గుర్తించడం, ఆయా గోదాములను పసిగట్టడం ద్వారా పత్తి, మిర్చి లాంటి వాణిజ్య పంటల రైతాంగం నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.తాము అప్రమత్తంగానే ఉన్నామని వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి చెప్పారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్‌్కఫోర్స్‌ కమిటీలు క్రియాశీలంగానే పనిచేస్తున్నాయన్నారు. ఈ ఏడాది జూన్‌ 19 నాటికి నకిలీ విత్తనాలకు సంబంధించి 15 మందిపై 60 కేసులు, 122 మందిపై 420 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇందులో 10,705 క్వింటాళ్ల పత్తి విత్తనాలను సీజ్‌ చేశామని, వీటి విలువ రూ.4 కోట్లకు పైగానే ఉంటుందని వెల్లడించారు. మరో రూ.4 కోట్లకు పైగా విలువ గల పలు రకాల పంటల విత్తనాలను అదుపులోకి తీసుకుని వాటికి సంబంధించి విచారణ జరుపుతున్నామని చెప్పారు.నకిలీ విత్తన మాఫియా తన కార్యకలాపాల కోసం పలు రకాలుగా విత్తనాలు, వాటి ప్యాకెట్లను ఉపయోగించుకుంటోంది. ప్యాక్‌ చేయకుండా విత్తనాలు అమ్మడం, జీఈఏసీ అనుమతి లేకుండా విక్రయించడం, గడువు ముగిసిన విత్తనాలను రీసైక్లింగ్‌ చేయడం, నకిలీ విత్తనాలను స్థానికంగా తయారు చేయడం, లేబుళ్లు మార్చడం, స్టాక్‌లో తేడాలుండటం, స్టాక్‌ రిజిస్టర్లలో విత్తనాలను నమోదు చేయకపోవడం, అనధికారికంగా విత్తనాలను ప్యాక్‌ చేయడం లాంటి మార్గాల ద్వారా నకిలీ విత్తనాలను మార్కెట్‌లోకి పంపుతుంటారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వీటి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, అన్నింటినీ సరిచూసుకున్న తర్వాతే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

Related Posts