హైదరాబాద్, జూన్ 24,
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ సీజన్ లో రైతులకు రైతు బంధు నగదును చెల్లించేందుకు 5794 సూక్ష్మ ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డా.బీవీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం 2020-21 సీజన్ లో లక్షా 73 వేల మంది రైతులకు రూ.169 కోట్లను ఈ మైక్రో ఏటీఎంల ద్వారా పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు. కొందరు రైతులు కోవిడ్ కారణంగా నగదును విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారికి ఈ సూక్ష్మ ఏటీఎంలు ఎంతగానో దోహదపడుతాయని ఆయన అభిప్రాయపడ్డారు
ఏదైనా బ్యాంకులో ఖాతా కల్గినవారు తమ దగ్గరలోని పోస్టాఫీసుకు ఆధార్, రిజిస్టర్ మొబైల్ ఫోన్ తో వెళ్లి, ఫోన్ లో వచ్చే ఓటీపీ ఆధారంగా నగదును విత్ డ్రా చేసుకోవచ్చునని తెలిపారు. ఈ సూక్ష్మ ఏటీఎంల ద్వారా నగదు విత్ డ్రా చేసుకునేందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదని, ఇది ఉచిత సేవ అని వివరించారు. ఒక్కో మైక్రో ఏటీఎం ద్వారా ఒకసారి రూ. పది వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. రైతుబంధు నిధులను రైతులకు సక్రమంగా అందజేయటంలో పోస్టల్ సిబ్బంది అందిస్తున్న సేవలను గుర్తించి, కరోనా వ్యాక్సినేషన్ లో తమ సిబ్బందికి తగిన ప్రాధాన్యతనిచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.