న్యూఢిల్లీ, జూన్ 24,
పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడ్‌విట్‌పై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జులై చివరి వారంలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారని, పూర్తి వివరాలను పేర్కొనలేదని గురువారం నాటి విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. అఫిడ్‌విట్‌లో ఓ ప్రణాళిక లేదని, అంతా అనిశ్చితేనని ధర్మాసనం పెదవి విరిచింది. పరీక్షలపై ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పరీక్షల వల్ల ఒక్కరు చనిపోయినా రూ.కోటి పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. కరోనా రెండో దశలో ఎటువంటి పరిస్థితి వచ్చిందో చూశామని, పలు వేరియంట్లు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నా ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించింది. పరీక్షల నిర్వహణపై సిబ్బంది వివరాలు ఏమీ ఇవ్వలేదంది. ఎంత మంది సిబ్బందిని నియమిస్తారు.. జులై చివరి వారంలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.. అఫిడ్‌విట్‌లో పక్కా సమాచారం ఇవ్వలేదని తూర్పారబట్టింది. పరీక్షలకు 15 రోజుల ముందు చెబుతున్నారు.. రెండు వారాల సమయం ఎలా సరిపోతుందని ధర్మాసనం మండిపడింది. పెద్ద మొత్తంలో గదులు అవసరమని, వాటిని ఎలా అందుబాటులోకి తెస్తారని పలు ప్రశ్నలు సంధించింది. ఒక్కో గదిలో 15, 20 మంది ఎలా సాధ్యమవుతుందని, 34 వేలకుపైగా గదులు అవసరవుతాయి.. అది ఆలోచించారా అని ధర్మాసనం మండిపడింది. గ్రేడ్‌లను మార్క్‌లను మార్చడం కష్టమేనని, పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాలని తెలిపింది. అవసరమైతే సీబీఎస్ఈ, యూజీసీ, యూపీఎస్సీ వంటి కేంద్ర సంస్థల సలహాలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనే వైఖరితోనే ఉంది తప్పా.. మూల్యాంకనం, తదితర అంశాలపై నిర్ధిష్టమైన ప్రణాళికను వెల్లడించలేదని వ్యాఖ్యానించింది. వ్యవహారం విద్యార్థులపై ఎంత ప్రభావం చూపుతుందో అవగాహన చేసుకోవాలని తెలిపింది. పరీక్షల నిర్వహణ కోసం విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. మన నిర్ణయాలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉండాలని, పరిస్థితి తీవ్రతను ప్రభుత్వం అర్ధం చేసుకోవడం లేదని విమర్శించింది. పరీక్షలు మొదలైన తర్వాత థర్డ్ వేవ్ వస్తే ఏం చేస్తారని నిలదీసింది. ప్రభుత్వమే అన్ని రకాల వసతులను కల్పించాలని పేర్కొంది. నేపథ్యంలో ప్రభుత్వ తరఫున న్యాయవాది తమకు కొంత సమయం కావాలని, చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే, ఈ విషయంలో ఎక్కువ సమయం ఇవ్వలేమని, గురువారం సాయంత్రంలోగా ప్రభుత్వం నిర్ణయం తెలియజేయాలని ఆదేశించింది. ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఒక కోణంలోనే కాదు.. 360 డిగ్రీల్లోనూ ఆలోచించాలంది. ఇంకా ఎక్కువ సమయం కుదరదని తెగేసి చెప్పింది.