విజయనగరం, జూన్ 25
విజయనగరం జిల్లాలో ఎంత కాదన్నా పూసపాటి వారి వంశస్థులకే విలువా, గౌరవం. అది రాజకీయాలకు మించిన అనుబంధం. ఈ విషయంలో తెలిసో తెలియకో వైసీపీ దూకుడుగా వెళ్ళి బొక్క బోర్లా పడింది. మరో వైపు తెలుగుదేశం కూడా పాత తరం అంటూ అశోక్ గజపతి రాజు ని పక్కకు నెట్టే ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అశోక్ ని తగ్గించిన ఫలితంగా 2019 ఎన్నికల్లో టీడీపీ కి జిల్లాలో సున్నా మార్కులు వచ్చాయి. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఒక్కటి కూడా దక్కలేదు. దాంతో పాటుగా కొన్నాళ్ళుగా వర్గ పోరు విజయనగరంలో సాగుతూంటే అధినాయకత్వం అశోక్ గజపతి రాజు వ్యతిరేకులకు ఊతం ఇచ్చిందన్న ప్రచారం జరిగింది విజయనగరం జిల్లాలో సామాజిక సమీకరణలను నమ్ముకుని టీడీపీ చేసిన ప్రయోగం విఫలం అయింది అనడానికి తాజాగా జరిగిన స్థానిక ఎన్నిక ఫలితలు నిదర్శనం అంటున్నారు. జిల్లా ప్రెసిడెంట్ గా కిమిడి నాగార్జునను చేసి అనేక చోట్ల మార్పులు చేస్తే ఎక్కడా కూడా పసుపు జెండా ఎగరలేదు. దాంతో పాటు అశోక్ గజపతి రాజు ని పక్కన పెట్టేసి కొత్త నాయకత్వం అంటూ చేతులు కాల్చుకున్నారన్న మాట కూడా వినిపిస్తోంది. ఇక విజయనగరంలో టీడీపీ ఆఫీస్ ఎక్కడ అంటే అశోక్ బంగ్లా అని చెబుతారు. దానికి పోటీగా మరో ఆఫీస్ తెరచి టీడీపీ నేతలు హడావుడి చేసినా జనాల మెప్పు పొందలేకపోయారు అంటున్నారు. ఈ నేపధ్యంలో మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో అశోక్ గజపతి రాజు మాజీ అయిపోయారు. ఆయనకు ఈ సమయంలో టీడీపీ నుంచి దక్కిన మద్దతు కూడా అంతంత మాత్రమే అంటున్నారు. మొత్తానికి అశోక్ తనకు తానుగా కోర్టులో పోరాటం చేసి సాధించుకున్నారు. ఇపుడు అశోక్ గజపతి రాజు పరపతి ఏంటి అన్నది అటు వైసీపీకి ఇటు టీడీపీకి బాగానే తెలిసింది అంటున్నారు. వైసీపీ అయితే రాజకీయ ప్రత్యర్ధి కాబట్టి అశోక్ విషయంలో సమరం తప్పదన్న తీరులోనే వెళ్లే అవకాశం ఉంది. కానీ టీడీపీకి మాత్రం పెద్దాయన ఇపుడు మళ్ళీ గుర్తుకు వస్తున్నారు అంటున్నారు. ఆయనకు ఉన్న జనాభిమానం మరోమారు కళ్లారా చూసిన టీడీపీ అశోక్ గజపతి రాజు తోనే వెళ్తేనే తప్ప బతికి బట్టకట్టదని కూడా విశ్లేషణలు ఉన్నాయి.ఇక గతంలో చంద్రబాబు అశోక్ గజపతి రాజు కి ఇచ్చిన విలువ ఇపుడు కూడా ఇస్తే 2024 నాటికి పార్టీ జిల్లాలో పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. మిగిలిన వారు అంతా ప్రజలలో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు అన్నది తెలిసిందే. ఈ నేపధ్యంలో పెద్దాయన చేతికి పార్టీ పగ్గాలు అప్పగించి ఆయన చెప్పినట్లుగా వింటే కచ్చితంగా ఎంతో కొంత టీడీపీ పుంజుకుంటుంది అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే మాన్సాస్ కుర్చీ పోరులో విజయం సాధించడం ద్వారా అశోక్ గజపతి రాజు తన సత్తా ఏంటో చాటి చెప్పారు. అటు ప్రత్యర్ధి పార్టీకే కాదు ఇటు సొంత పార్టీకి కూడా తన విలువ తెలిసొచ్చేలా చేసుకున్నారని అంటున్నారు. అశోక్ ని నమ్ముకుంటేనే టీడీపీకి భవిషత్తు అన్న మాటను ఆయన అనుచరులు నొక్కి చెప్పడం విశేషం.