ఏపీలో టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూ ఉన్నాయి. తను వైసీపీలోకి చేరబోతున్నట్టుగా ఇటీవలే టీడీపీ నేత కన్నబాబు ధ్రువీకరించగా, తాజాగా మరో నేత అదే విషయాన్ని ప్రకటించారు. ఈ సారి ఈ విషయాన్ని ప్రకటించింది వసంత కృష్ణప్రసాద్. కృష్ణా జిల్లా నందిగామలోని కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. తను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టుగా ప్రకటించారు. త్వరలోనే జగన్ ను కలిసి వైసీపీ కండువా కప్పుకోనున్నట్టుగా ఆయన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశాలున్నాయని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయనే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. తెలుగుదేశం పార్టీని వీడవద్దని చంద్రబాబు తనను కోరారు అని, గుంటూరు జిల్లాలో సీటు ఇస్తామనే హామీని కూడా ఇచ్చారని కృష్ణ ప్రసాద్ వివరించారు. ఇటీవల చంద్రబాబుతో సమావేశం అయినప్పుడు ఆ చర్చ జరిగిందని పేర్కొన్నారు. అయితే తనకు వైఎస్సార్ కుటుంబంతో, జగన్‌తో అనుబంధం ఉందని అందుకే వైఎస్సార్సీపీలో చేరబోతున్నట్టుగా కృష్ణ ప్రసాద్ వివరించారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు ఏ బాధ్యతలు అప్పగించినా, వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. తనతో పాటు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లోని తన అనుచరులు, సన్నిహితులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరతారని ఆయన తెలిపారు.