YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

2024 నాటికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే...

2024 నాటికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే...

విజయవాడ, జూన్ 25,
రానున్న ఎన్నికలు జగన్ కు కూడా ప్రతిష్టాత్మకమే. మరోసారి అధికారంలోకి రావాలని జగన్ గట్టిగా భావిస్తున్నారు. ఇందుకోసం సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలుపరుస్తున్నారు. గెలిచిన మరుసటి రోజు నుంచే తాను ఇచ్చిన హామీలతో పాటు సంక్షేమ కార్యక్రమాలకు క్యాలండర్ ను రూపొందించి మరీ జగన్ లబ్దిదారుల ఖాతాల్లోకి నగదును నేరుగా జమ చేస్తున్నారు. ఇక పేద, మధ్య తరగతి వర్గాలు కూడా జగన్ పాలన పట్ల సంతృప్తికరంగానే ఉన్నాయి. ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా జగన్ నియమించుకున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. 2019 ఎన్నికలు జగన్ కు జీవన్మరణ సమస్య. 2014లో ఎలాంటి వ్యూహకర్త లేకుండానే జగన్ ఎన్నికలకు వెళ్లారు. అయితే అప్పుడు తృటిలో అధికారం చేజారి పోయింది. అధికారంలోకి జగన్ ఎప్పుడూ రాలేడన్న ప్రచారం ఎక్కువగా జరిగింది. దీంతోనే 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఇంత భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం జగన్ ను కూడా ఆలోచనలో పడేసిందంటారు. అందుకోసమే 2019 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. జగన్ కష్టం కావచ్చు, ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కావచ్చు మొత్తం మీద జగన్ కు బంపర్ మెజారిటీని తెచ్చిపెట్టాయి. జగన్ కూడా ఇంతటి విజయాన్ని ఊహించి ఉండకపోవచ్చు. అయితే ఈ విజయం మొత్తాన్ని విపక్షాలు ప్రశాంత్ కిషోర్ ఖాతాలోనే వేశాయి. అది జగన్ కు నచ్చడం లేదంటారు. తాను 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీకి గెలుపు సాధించిపెడితే దానిని పీకే ఖాతాలో వేయడాన్ని జగన్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది తన వ్యక్తిగత ఇమేజ్ కే ఇబ్బంది అని జగన్ భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వ్యూహకర్త లేకుండానే బరిలోకి దిగాలని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. ప్రశాంత్ కిషోర్ ఎటూ ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక ఆయనకు దూరంగా ఉండటం మేలని జగన్ భావిస్తున్నారు. పీకేతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని జగన్ ఇప్పటికే సీనియర్ నేతలను ఆదేశించినట్లు తెలిసింది. పీకేతో భవి‌ష్యత్ లో జాతీయ స్థాయిలోనూ ఇబ్బందులు ఎదురవుతాయని జగన్ భావిస్తున్నారు. తన సంక్షేమ పథకాలే తనను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వ్యూహకర్త జగనేనన్న టాక్ పార్టీ లో బలంగా విన్పిస్తుంది.

Related Posts