దేశంలో మూడో ఫ్రంట్ వస్తుందంటూ సాగుతున్న ప్రచారం బీజేపీకి పండుగలా కనిపిస్తోంది. అందులోనూ సవాలక్ష విభేదాలున్న పార్టీలు అన్నీ కలిపి జట్టు కడతామంటున్నాయి. కమలం పార్టీని కట్టడి చేయాలంటే తమ మధ్య ఉన్న సైద్దాంతిక వైరుద్ధ్యాలు, ఆధిపత్య పోరును పక్కన పెట్టి ఫ్రంట్ లో భాగస్వామ్యం వహించాలనేది మేధావుల సూచన. కానీ కాంగ్రెసు పార్టీ ఇప్పటికే ఒక కూటమికి సారథ్యం వహిస్తోంది. దానిని కాదంటూ మరో కుంపటి పెట్టడానికి హస్తం పార్టీ అంగీకరించే ప్రసక్తే లేదు. అన్ని పార్టీలు తమతో కలిసి రావాలని కాంగ్రెసు కోరుకుంటోంది. ఇంతవరకూ కాంగ్రెసుతో కలిసి నడిచిన పార్టీలు వివిధ రాష్ట్రాల్లో దానిని వదిలించుకోవాలని చూస్తున్నాయి. తమ పార్టీలకు కాంగ్రెసు అదనపు బారంగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెసు లేకుండా ఫ్రంట్ కట్టడం సాధ్యమా? ఒకవేళ రాజకీయ అవసరాల కోసం గుంపుగా చేరినా మనుగడ సాగించగలదా? అన్న ఆసక్తి ఏర్పడుతోంది. శరద్ పవార్, యశ్వంత్ సిన్హా వంటి నాయకులు కూటమి పేరు బహిరంగంగా చెప్పకుండా లోపాయకారీ సమావేశాలను దశలవారీగా నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తొలి సమావేశానికి శరద్ పవార్ ఆతిథ్యమిచ్చారు. వీటన్నిటికీ తెరచాటు వ్యూహం ప్రశాంత్ కిశోర్ నిర్వహిస్తున్నారు. దేశ రాజకీయాల్లో కీలకమైన ఈ పరిణామం ఎటు దారి తీస్తుందోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.పార్టీలన్నిటికీ కలవాలని ఉంది. అయితే అది సైద్దాంతికంగా కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ అధికారాన్ని బీజేపీ క్రమేపీ స్థిర పరుచుకుంటోందనే భయమే వాటిని ఒక గూటికి చేరుస్తోంది. ఒక్కసారి అధికారం బీజేపీ వశమైతే శాశ్వతంగా అక్కడ తిష్ట వేస్తుంది. బీజేపీ బలపడిన తర్వాత ప్రాంతీయ పార్టీలు ప్రాబల్యం కోల్పోతున్నాయి. అందుకే ప్రాంతీయ నేతలు తమ హవా చూపించాలంటే బీజేపీని నివారించడం అనివార్యంగా భావిస్తున్నారు. జాతీయ పార్టీ కాంగ్రెసు నుంచి గడచిన మూడు దశాబ్దాల్లో ఇటువంటి భయం ఎన్నడూ ఎదురు కాలేదు. కమలం పార్టీ మాత్రం కలవరం కలిగిస్తోంది. ఢిల్లీలో పదిహేనుమంది ప్రముఖ నేతల సమావేశాన్ని ఈ కోణంలోనే చూడాలి. ఎన్సీపీ, తృణమూల్, ఆప్, సీపీఐ నాయకులు బహిరంగమవుతున్నారు. ఆర్జెడీ, జేడీఎస్, సీపీఎం వంటి పార్టీలు సైతం ఈ చర్చలను స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయాలకు అవసరమైన ప్రత్యామ్నాయ అజెండాను ప్రాథమికంగా తయారు చేయడం లక్ష్యంగా చర్చలకు శ్రీకారం చుట్టారు. అయితే కేవలం రాజకీయ ప్లాట్ ఫామ్ గా కాకుండా దేశంలోని మేధోవర్గాలను సైతం కలుపుకు పోవాలనేది ఎత్తుగడ. వివిధ రంగాలకు చెందిన జావేద్ అక్తర్, కరణ్ థాపర్ వంటి వారినీ భాగస్వాములను చేస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో విస్తృతమైన మద్దతు లభిస్తుందనేది అంచనా.కాంగ్రెసు నేతృత్వంలోని యూపీఏ కూటమిలో చీలిక తేగలిగితే మాత్రమే కొంతవరకూ మూడో ఫ్రంట్ సక్సెస్ సాధించేందుకు అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రదాన ప్రత్యర్థి కాంగ్రెసు మాత్రమే. ప్రాంతీయ నేతలు ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజాక్షేత్రంలో ఇతర పార్టీలకు పాన్ ఇండియా ఇమేజ్ లేదు. రాజస్థాన్, మద్యప్రదేశ్, హిమాచల ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక వంటి చోట్ల కాంగ్రెసు , బీజేపీలు ముఖాముఖి తలపడుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలతో కలుపుకుంటే 200 పైచిలుకు స్థానాలలో హస్తం , కమలం పార్టీలే ముఖాముఖి పోటీ చేస్తున్నాయి. ఇతర మిత్రపక్షాలను కలుపుకుంటే మరో 70 స్థానాలు కాంగ్రెసు కూటమికి బీజేపీకి మధ్య పోటీ ఉంటుంది. దాదాపు లోక్ సభ సీట్లలో సగం పోటీ కాంగ్రెసు, కమలం మద్యనే కేంద్రీకృతమై ఉంటుంది. అటువంటి స్థితిలో కాంగ్రెసును పక్కన పెట్టి చేసే ప్రయత్నాలు పెద్దగా రాణించవని ఎవరినడిగినా చెప్పేస్తారు. అయితే తొలి దశలో ఇతర పక్షాల మధ్య ఏకాభిప్రాయం వచ్చాక హస్తం పార్టీని కూడా అభ్యర్థించేందుకు రాయబారం నడిపేందుకూ చాన్సులున్నాయి.దేశంలోని పెద్ద ప్రాంతీయ పార్టీలు బీజేపీతో పాటు కాంగ్రెసు ప్రాధాన్యాన్ని కూడా తగ్గించాలనే యోచన చేస్తున్నాయి. సమాజ్ వాదీ, ఎన్సీపీ, తృణమూల్, ఆప్ వంటి పార్టీలు ఈవిషయంలో ముందు వరసలో ఉన్నాయి. కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనకు పెద్ద అవకాశాలు లభించలేదనేది ఎన్సీపీ అధినేత పవార్ ఆరోపణ. ప్రదాని పదవి దక్కకపోయినా ఉప ప్రధాని, రాష్ట్రపతి వంటి పదవులకు తాను అర్హుడిననేది ఆయన ఆలోచన. బీజేపీతోనూ పవార్ కు శతృత్వం లేదు. కానీ బీజేపీ అప్పగించే పదవులు ఆయనకు సంత్రుప్తి నివ్వవు. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి ఇష్టపడక మహారాష్టలో చిరకాల మిత్రపక్షమైన శివసేననే బీజేపీ పక్కన పెట్టేసింది. అంటే పదవుల విషయంలో రాజీ లేదనే సంకేతాలనే ఇచ్చింది. బిహార్ లో మాత్రం నితీశ్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. అది వ్యూహాత్మక ఎత్తుగడ. తాను కాదంటే నితీశ్ ఆర్జెడీతో చేతులు కలుపుతాడు. అందుకే బీజేపీ తన ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. పవార్ కూడా అదే రకమైన ఎత్తుగడలతో రాజకీయం నడుపుతారు. త్యాగం చేయకుండా పార్టీ , వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్ద పీట వేయడం పవార్ కు అలవాటు. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ మూడో ఫ్రంట్ నాయకుల ప్రయత్నాలను మనసారా ఆహ్వానించే పరిస్థితి లేదు. గతంలో కేంద్రంలో రెండు సందర్భాల్లో కాంగ్రెసు పార్టీ ఇతర కూటములకు మద్దతిచ్చింది. కానీ తాత్కాలికంగా మాత్రమే. తొమ్మిదో దశకం మొదట్లో చంద్రశేఖర్ నాయకత్వంలోని కూటమికి మద్దతిచ్చి రోజుల వ్యవధిలోనే కూల్చేసింది. 96లో యునైటెడ్ ఫ్రంట్ కు మద్దతిచ్చింది. అది కూడా రెండేళ్లకే కూలిపోయింది. అందువల్ల ఇతర పార్టీల ప్రయోజనాల కోసం ఏడేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న హస్తం పార్టీ త్యాగం చేయాలనుకోదు. పైపెచ్చు ఈ కూటమి బలపడుతుందని కాంగ్రెసువాదులకు అనుమానం ఏర్పడితే అక్కడక్కడా బీజేపీకి సహకరించే ప్రమాదం కూడా లేకపోలేదు. ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణంలో ముఖాముఖి పోటీ ఏర్పడాలంటే కాంగ్రెసు చుట్టూ ఇతర పార్టీలు చేరితేనే మేలు. జాతీయంగా గట్టి కూటమి ఏర్పడుతుంది. హస్తం పార్టీని ఆవల పెట్టి ఎన్ని సార్లు భేటీలు జరిగినా, మంతనాలు నిర్వహించినా విఫల ప్రయత్నాలే