హైదారాబాద్, జూన్ 25,
ఏప్రిల్–జూన్ 2021 మధ్య కాలంలో దేశంలోని ఏడు ప్రధాన సిటీలలో ఇండ్ల అమ్మకాలు అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 93 శాతం పెరిగాయి. కాకపోతే, జనవరి–మార్చి క్వార్టర్తో పోలిస్తే మాత్రం ఈ అమ్మకాలు 58 శాతం పడిపోయాయి. కరోనా సెకండ్వేవ్ ఎఫెక్ట్తో తాజా క్వార్టర్లో సేల్స్ తగ్గాయని ప్రోపర్టీ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), చెన్నై, కోల్కత, బెంగళూరు, హైదరాబాద్, పుణె సిటీలలో మొత్తం 24,570 హౌసింగ్ యూనిట్లు అమ్ముడయినట్లు తెలిపింది. కిందటేడాది ఏప్రిల్–జూన్ మధ్యలో 12,740 రెసిడెన్షియల్ హౌసింగ్ యూనిట్లు సేలవగా, ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్లో 58,290 హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోయాయని అనరాక్ ఈ రిపోర్టులో పేర్కొంది. ఈ క్వార్టర్ ఇంకా పూర్తవడానికి వారం రోజులుండగానే అనరాక్ ఈ డేటాను ప్రకటించింది. అయితే, డేటా ముందుగా ఎందుకు రిలీజ్ చేసిందో మాత్రం అనరాక్ వెల్లడించలేదు. సాధారణంగా క్వార్టర్ ముగిశాక ప్రాప్టైగర్, నైట్ ఫ్రాంక్ ఇండియా, ప్రాప్ఈక్విటీ, జేఎల్ఎల్ ఇండియాలు తమ డేటాను విడుదల చేస్తున్నాయి. ఏడు మేజర్ సిటీలలోనూ రెసిడెన్షియల్ హౌసింగ్ యూనిట్ల అమ్మకాలపై కరోనా సెకండ్వేవ్ ఎఫెక్ట్ పడిందని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి చెప్పారు. అంతకు ముందు క్వార్టర్తో పోలిస్తే అమ్మకాలు బాగా తగ్గాయని పేర్కొన్నారు. కిందటేడాది ఏప్రిల్–జూన్ మధ్యలో అమ్మకాలతో పోలిస్తే మాత్రం తాజా క్వార్టర్లో సేల్స్ చాలా మెరుగ్గా ఉన్నాయన్నారు. అంతకు ముందు ఏడాది నేషనల్ లాక్డౌన్లాగా ఈ ఏడాది లోకల్ లాక్డౌన్లు ఎక్కువ ప్రభావం చూపించలేదన్నారు. వ్యాక్సినేషన్ ఊపందుకోవడంతో చాలా రాష్ట్రాలలో రెస్ట్రిక్షన్లు తొలగిపోతున్నాయని, దీంతో ఇండ్ల అమ్మకాలు జులై–సెప్టెంబర్ క్వార్టర్లో మళ్లీ జోరందుకుంటాయని పురి చెప్పారు. గతంలో ఇళ్లు కొన్నవారు ఇప్పుడు పెద్ద ఇళ్లు కావాలనుకుంటున్నారని, మిలినియల్స్ ఇళ్ల కొనుగోళ్లలో చాలా యాక్టివ్గా ఉంటున్నారని పురి వెల్లడించారు. ఏప్రిల్–జూన్ 2021 క్వార్టర్లో ముంబైలో హౌసింగ్ సేల్స్ ఏకంగా రెండు రెట్లు పెరిగి 7,400 యూనిట్లకు చేరాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఈ అమ్మకాలు 3,620 యూనిట్లే. పుణెలో తాజా క్వార్టర్లో అమ్మకాలు 3,790 యూనిట్లు. ఇక ఢిల్లీ ఎన్సీఆర్లో సేల్స్ 65 శాతం పెరిగి 3,470 యూనిట్లకు చేరుకున్నాయి. బెంగళూరులో ఇండ్ల అమ్మకాలు 19 శాతం పెరిగి 3,560 యూనిట్లకు చేరినట్లు రిపోర్టు తెలిపింది. మన హైదరాబాద్లో ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ఇండ్ల అమ్మకాలు ఏకంగా 3,240 యూనిట్లకు పెరిగాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఈ సేల్స్ 660 యూనిట్లు మాత్రమే. మార్చి 2021 క్వార్టర్తో పోలిస్తే మాత్రం ఇండ్ల అమ్మకాలు 26 శాతం తగ్గుతాయని అనరాక్ రిపోర్టు వెల్లడిస్తోంది. మార్చి 2021 క్వార్టర్లో హైదరాబాద్లో 4,400 ఇండ్లు అమ్ముడుపోయాయి.ఏడు సిటీలలోనూ కలిపి అన్సోల్డ్ ఇన్వెంటరీ (అమ్ముడుపోని ఇండ్లు) తాజా క్వార్టర్లో 2 శాతం పెరగొచ్చని అనరాక్ అంచనా వేస్తోంది. ఈ క్వార్టర్లో సప్లయ్ పెరగడమే దీనికి కారణమని పేర్కొంది. కరోనా సెకండ్వేవ్ ఎఫెక్ట్తో ఈ సిటీలలో రెసిడెన్షియల్ ప్రోపర్టీల రేట్లు మాత్రం నిలకడగానే ఉన్నాయని అనరాక్ రిపోర్టు తెలిపింది. ఏడాది ప్రాతిపదికన చూస్తే ఈ పెరుగుదల బెంగళూరు, ఎన్సీఆర్లో 2 % ఉంటే, ఎంఎంఆర్, పుణె, హైదరాబాద్, చెన్నైలలో ఒక శాతం ఉందని తెలిపింది.