వనపర్తి జూన్ 25
ఒక్క ఏడాదిలో తెలంగాణలో పంజాబ్, హర్యానాలతో సమానంగా వరి దిగుబడి ఉత్పత్తి అయిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో 3 కోట్ల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయిందని మంత్రి స్పష్టం చేశారు.గోపాల్‌పేట మండలం మున్ననూరు, గోపాల్‌పేట, బుద్దారం, పొలికెపాడులో రైతువేదికలు, పల్లె ప్రకృతి వనాలను వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితులలో రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేసిందన్నారు. ప్రతి ఏటా పంటలు కొనుగోలు చేయడం ప్రభుత్వానికి సాధ్యం కాదన్నారు. పంటల మార్పిడి వైపు రైతు లోకం దృష్టి సారించాలి అని సూచించారు. పప్పు దినుసులు, నూనెగింజలు, పత్తి సాగు వైపు రైతాంగం మొగ్గుచూపాలి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ ఆహార అవసరాలకు అనుగుణంగా పంటలు సాగుచేయాలి. అన్ని కాలాల్లో అన్ని రకాల కూరగాయలు సాగు చేసే విధంగా రైతులు సుశిక్షితులు కావాలి అని పేర్కొన్నారు. రైతులు తమకున్న పొలంలో కొంత భాగం కూరగాయల సాగును చేపట్టాలి. భవిష్యత్ లో తెలంగాణ రైతులు సాగులో అద్భుతాలు సృష్టించాలని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు.