YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సంచులు..సమస్యలు..

సంచులు..సమస్యలు..

తెలంగాణలో ధాన్యం సేకరణ సాగుతోంది. అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయడంతో అన్నదాతలు తమ పంటను విక్రయించుకునేందుకు క్యూ కడుతున్నారు. ధాన్యాన్ని కేంద్రాలకు చేర్చుతూ గిట్టుబాటు ధరకు అమ్ముకుంటున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచుల కొరత తలెత్తుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కామారెడ్డిలోని పలు కేంద్రాల్లో ఈ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ధాన్యం పెద్దమొత్తంలో రావడం వల్ల గోనె సంచులకు కొరత ఏర్పడడంలేదని... కొందరు గోల్ మాల్ చేయడంవల్లే ఈ సమస్య తలెత్తుతోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి బియ్యం మిల్లులకు ధాన్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఏటా గోనె సంచులను సరఫరా చేస్తుంటుంది. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే కొనుగోలు కేంద్రాల నుంచి బియ్యం మిల్లులకు చేరిన సంచులు తిరిగి పౌరసరఫరాల విభాగానికి రావడం లేదని సమాచారం. అరకొరగా పనికిరాని రంధ్రాలుపడినవాటిని మాత్రమే తిరిగి పంపిస్తూ మిల్లర్లు చేతివాటం చూపుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

 

ప్రభుత్వం ఇచ్చిన గోనె సంచులు తిరిగి రాకపోవడం వల్ల రూ.కోట్లలోనే నష్టం జరుగుతోంది. అవకతవకలకు పాల్పడుతున్న మిల్లర్లపై పౌరసరఫరాల శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శ ఉంది. జిల్లాలో ప్రతి పంట సీజన్‌లో సుమారుగా పదిహేను లక్షల నుంచి పన్నెండు లక్షల గోనె సంచులను కేంద్రాలకు బియ్యం మిల్లర్లు అందించాల్సి  ఉంటుంది. ఇందులో సుమారుగా ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు చిరిగిన సంచులు వెనక్కి వస్తున్నాయి. అంటే ఏటా సుమారుగా రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల మేర అక్రమాలు జరుగుతున్నాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయమై స్పందించిన ఉన్నతాధికారులు అవకతవకలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నాణ్యమైన గోనె సంచులనే తీసుకోవాలని కేంద్రాల నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. బియ్యం మిల్లర్లు ఇవ్వాల్సిన సంచులను రికవరీ చేస్తామని తిరిగి ఇవ్వకుంటే వారికి ఇవ్వాల్సిన బిల్లుల నుంచి కోత విధిస్తామని తేల్చిచెప్పారు.

Related Posts