బెంగాల్ రాష్ట్రంలో ఒకప్పుడు మాధవదాసు అనే భక్తుడు ఉండేవాడు. భార్య మరణించడంతో సంసార జీవితంపై విరక్తి చెంది కాషాయ వస్త్రాలు ధరించి పూరీ చేరుకున్నాడు. అహర్నిశలు జగన్నాధుని స్మరిస్తూ పగలంతా దేవాలయంలో గడిపి రాత్రికి సముద్ర ఒడ్డు చేరుకుని ఇసుకతిన్నెలపై హాయిగా నిద్రించే వాడు. నిరవధిక ఉపాసన వల్ల కాబోలు అతనిలో వింత తేజస్సు,శక్తి ఉట్టిపడుతూండేవి. ఒకరోజు ఒక విచిత్రం జరిగినది. పూరీ జగన్నాధుడు తన సోదరి సుభద్రతో రాత్రి సముద్రతీరమంతా తిరిగి అక్కడ బంగారుపళ్లెమును వుంచి అదృశ్యమయ్యాడు. ఆ ప్రాంతంలో ఇసుకతిన్నెలపై తిరుగుతున్న మాధవదాసు మైమరచి జగన్నాధ నామ స్మరణచేస్తూ ఒక్కసారిగా కనులుతెరవగా ఎదురుగా రుచికర పదార్థాలతో బంగారుపళ్లెము కనపడినది. అతడు ఏ విధమైన భావము లేకుండా పళ్లెంలోని ప్రసాదమును భుజించి మరల ధ్యానములో మునిగి పోయాడు. అతనికి నిర్విచార స్థితి కలిగింది. అక్కడకు బంగారుపళ్లెము ఎలా వచ్చినదీ ఆలోచించ లేదు. పళ్లెంలో అంత రుచికర భోజనం ఎవరు తెచ్చారో అన్న దానిపైనా దృష్టి పెట్టలేదు. ఇక్కడ ఉదయంకాగానే గుడి తలుపులు తెరిచినపూజారులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. మహా భోగమును నివేదించిన బంగారుపళ్లెము వుండవలసిన చోట లేదు. ఆలయ అధికారులు పళ్లెము తస్కరింపబడెనని రాజుకు ఫిర్యాదు చేసారు. దొంగను వెదుకుతూ రాజభటులు సముద్రతీరం వచ్చి మాధవదాసు వద్ద పళ్లెం చూసి వెంటనే ఆయనను బంధించి రాజు వద్ద ప్రవేశపెట్టారు. మహారాజు అతన్ని చెరసాలలో బంధించాడు. ఆ రోజు రాత్రి ముఖ్య పూజారికి ఒక కల వచ్చింది. కలలో జగన్నాధుడు కనిపించాడు. "మీరు నాకు ఎంతో భక్తిశ్రద్ధలతో నివేదించిన నైవేద్యమును నా ప్రియ భక్తుడు తింటే అతణ్ని చెరసాల పాలు చేసారు. నా భక్తుల హృదయాలలో ఎల్లవేళలా నేను వుంటానన్న విషయం మరిచారా?" పూజారి ఉలిక్కిపడి లేచి ఈ విషయం మహారాజుకు తెలియజేసాడు. వెంటనే మహాభక్తుడు మాధవదాసు విడుదల కాబడ్డాడు. ప్రజల్లో ఈ విషయం ప్రాకిపోయింది. మాధవదాసు భక్తిప్రపత్తులు, కీర్తి ప్రతిష్టలు దశదిశలా వ్యాపించాయి. పూరీలో నివాసం వుంటున్న పండితులకు ఇది అసూయా కారణమైంది. ఎక్కడో బెంగాలు నుండి వలస వచ్చిన ఒక సాధారణ భక్తుడికి ఇంత ఉన్నతస్థాయిలో గౌరవాదరములు లభించుట వీరికి మరింత కోపకారణమైంది. ఏదో విధంగా మాధవదాసు తమంతగొప్ప వాడు కాదని నిరూపించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత పూరీలో వుంటున్న ఒకానొక పండితుడు మాధవదాసుని కలిసి "అయ్యా! మీరు చాలాగొప్ప పండితులని అందరూ చెప్పుకుంటున్నారు. మీతో వాదించాలని,తర్కంలో పాల్గొనాలని కోరికతో మీ వద్దకు వచ్చాను." అన్నాడు. వెంటనే మాధవదాసు " అయ్యా! నేను పండితుడను కాను.నా చదువు, శాస్త్రపరిజ్ఞానం పొట్టకూటికి నేర్చినవే. తమరే నాకన్నా గొప్ప వారని అంగీకరించుచున్నాను." అన్నాడు. "అయితే ఈ విషయాన్ని పత్రంపై రాసి ఇవ్వండి" అని ఒత్తిడి చేయగా మాధవదాసు దానికంగీకరించి ఒక పత్రం మీద "నేను పండితుణ్ని కాదు" అని వ్రాసి ఇచ్చాడు. పూరీ క్షేత్ర పండితులకు కావల్సినదీ అదే. వారు సంతోషంగా కాశీ మహా నగరానికి వెళ్లి అక్కడ పండిత సదస్సులో మాధవదాసు వ్రాసిన పత్రము చూపుతూ -- "పండితవర్యులారా! ఈపత్రములో మాధవదాసు 'తాను పండితుడను కాదని' ధృవీకరించినాడు. అదే వాక్యమును మీ అందరి ముందు చదువుతున్నాను" అని కాగితం మడత విప్పి పండిత నాయకుడు అందులోని వాక్యము చదువబోతూ ఆగిపోయాడు. ఒక్కసారిగాఆశ్చర్య చకితుడయ్యాడు. ఎలా చదవాలో అర్థం కాలేదు. 'ఇదేమి గారడీ' అనుకున్నాడు. ఆ పత్రములో మాధవదాసు 'పండితోత్తముడు' అని వ్రాయబడివున్నది. దిగువ మాధవదాసు సంతకం వున్నది. ప్రగల్భాలు పలికిన నాయకునికి సంగతి అర్థమైనది. 'ఈ పత్రములో మార్పు తెచ్చినది ఎవరో కాదు, ఖచ్చితంగా ఆ పూరీ జగన్నాధుడే' " కొసమెరుపు:
అనుక్షణం భక్తుల వెంట వుండి వారిని రక్షించే బాధ్యత ఆనందంగా స్వీకరిస్తాడు భగవంతుడు. భక్తుల ఓటమిని భక్తవత్సలుడు భరించలేడు.
*జై జగన్నాథ*