దేశ సమగ్రాభివృద్ధి తమ లక్ష్యమని ప్రధాని మోడీ అంటుంటారు. అయితే గుజరాత్ పై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. ఈ స్పెషల్ ఇంట్రెస్ట్ పరిశీలిస్తే.. మోడీ మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన రాకమానదు. ఇక గుజరాత్ లోని ధోలెరాపై ఆయనకున్న ప్లానింగ్ తెలుసుకుంటే.. మోడీకి స్వరాష్ట్రం బాగు తప్ప మరేమీ వద్దా? అనే సందేహాలు వెల్లువెత్తుతాయి. ఆ రేంజ్ అభివృద్ధి ఆ ప్రాంతంలో సాగిపోతోంది మరి. ధోలెరా నిజంగా సూపర్ స్మార్టే. ఎందుకంటే.. 920 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ఆకర్షణీయ నగరం నిర్మితమవుతోంది. ధోలెరా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కు 110 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా రూపుదిద్దాలన్నది ప్రధాని అభిలాష. చైనా వాణిజ్య రాజధాని షాంగైలా.. ధోలెరాను తయారు చేయాలన్నది ప్రధాని మోడీ లక్ష్యం. దానికి తగ్గట్లే.. ఈ ప్రాంతం విస్తీర్ణం ఉండేలా ప్లాన్ చేశారు. ధోలెరా కోసం మొత్తం 920 చదరపు కిలోమీటర్ల భూమి సేకరించారు. దీనిలో 567 పాయింట్ 39 చదరపు కిలోమీటర్ల భూమిలో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరం చేశారు.
ధోలెరాలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉంటాయి. అపార్ట్ మెంట్లు, విల్లాలు, ఆఫీసులు, పరిశ్రమలు, రోడ్లు, రవాణా సౌకర్యాలు అన్నీ వాల్డ్ క్లాసే. ఇక హై యాక్సస్ కారిడార్ ప్రాంతంలో అయితే సిటీ సెంటర్, ఇండస్ట్రియల్ లాజిస్టిక్, నాలెడ్జ్-ఐడీ, రిక్రియేషన్-స్పోర్ట్స్, ఎంటర్టైన్ మెంట్ విభాగాలు ఉంటాయి. ధోలెరా నుంచి ప్రముఖ నగరాలకు రాకపోకల నిమిత్తం ట్రాన్స్ పోర్ట్ కు భారీ ప్రణాళికలే నిర్దేశించుకున్నారు. ఈ సూపర్ సిటీ నుంచి మెగా సిటీలైన అహ్మదాబాద్, భావ్ నగర్, వడోదరలకు స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. మొత్తంగా ధోలెరాలో మెట్రో రైల్ తో పాటూ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు. 1700 ఎకరాల్లో ఎయిర్ పోర్ట్ నిర్మాణం సాగనుంది. ఇక ఎస్ఐఆర్ కు నౌకాశ్రయమూ దగ్గర్లోనే ఉంది. 2019నాటికి ధోలెరాలో కార్యకలాపాలు ప్రారంభించాలన్నది మోడీ టార్గెట్. ఆ కార్యక్రమం పూర్తైతే.. ఈ స్మార్ట్ సిటీ లక్ష మందికి నెలవుగా మారుతుంది. తక్కువ ఖర్చులోనే నాణ్యత జీవన ప్రమాణాలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకే ధోలెరాను ఆవిష్కరిస్తున్నారు. అందుకే ఈ ఇండియా షాంగైను వాప్యార, పారిశ్రామిక కార్యకలాపాలకే పరిమితం చేయలేదు. ప్రజలు నివసించేందుకూ భారీ స్థాయిలో ఏర్పాట్లు సాగుతున్నాయి.
మానసపుత్రిక అయిన ధోలెరాను అత్యద్భుతంగా తీర్చి దిద్దేందుకు ప్రధాని తపించిపోతున్నారు. స్వరాష్ట్రం కాబట్టి ఈ ప్రాజెక్టుపై అభిమానం ఉండొచ్చు. అయితే..ధోలెరా చూపినంత శ్రద్ధ, అభిమానం.. ఇతర ప్రాంతాలపైనే చూపడంలేదు. అదే ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తోంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలైతే ఆయన వైఖరిని తూర్పాబడుతున్నాయి. ఉత్తరాదిపై చూపినంత శ్రద్ధ దక్షిణ రాష్ట్రాలపై చూపడంలేదని మండిపడుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ సంగతి కొస్తే.. ఆయన వైఖరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. నవ్యాంధ్రను ఏ విధంగా నిర్లక్ష్యం చేశారో.. ఇక్కడి అభివృద్ధిని ఎంత తేలిగ్గా తీసుకున్నారో.. ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. ఓ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేసేందుకు తపించిపోతున్న ప్రధాని నరేంద్రమోడీ.. ఆంధ్రప్రదేశ్ ను మాత్రం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మోడీకి గుజరాత్ లోని ధోలెరా పాటి చేయడంలేదు నవ్యాంధ్ర. 2007 నుంచే ధోలెరా కోసం పాటుపడుతున్న మోడీ.. 2014 నుంచి రాష్ట్రం కోసం చేసింది పెద్దగా ఏమీ లేదు. ధోలెరాతో పోల్చితే.. ఆయన ఆంధ్రప్రదేశ్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసేశారని చెప్పుకోవచ్చని ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.