విజయవాడ, జూన్ 26,(న్యూస్ పల్స్)
అంధ్రప్రదేశ్ లో జగన్ బలంగా తయారయ్యాడు. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఢీకొట్టడం అంత ఈజీ కాదు. జగన్ ఇప్పుడు ఓటు బ్యాంకు పరంగా, ఆర్థికంగా శక్తిమంతుడుగా ఉండటంతో తెలుగుదేశం పార్టీకి ఊపిరి సలపనివ్వడం లేదు. జగన్ ను ఎన్ని రకాలుగా బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నా ఫలితాలు ఇవ్వడం లేదు. అయినా తెలుగుదేశం పార్టీ మాత్రం తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. జగన్ అవినీతిపరుడన్న ప్రచారాన్ని మళ్లీ ప్రారంభించింది. యనమల రామకృష్ణుడు ఇటీవల ఒక డిమాండ్ చేశారు. జప్తు చేసిన జగన్ ఆస్తులను ప్రభుత్వ ఖజానాలో జమచేయాలంటూ యనమల చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ బేలతనానికి నిదర్శనం. ఇంకా జగన్ను ప్రజల్లో అవినీతి పరుడిగా నిలబెట్టాలనే తెలుగుదేశం ప్రయత్నిస్తుంది. జగన్ 43 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని, దానిని ప్రభుత్వ ట్రజెరీలో జమ చేయాలని యనమల రామకృష్ణుడు ఎన్ఫోర్స్మెంట్ అధికారులను కోరారు. నీరవ్ మోదీ, మొహల్ చోక్సీ, విజయ్ మాల్యాల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లుగానే జగన్ ఆస్తులను కూడా ప్రభుత్వపరం చేయాలని, వాటిని ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించాలని యనమల రామకృష్ణుడు కోరారు. అంటే మరోసారి జగన్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ప్రయత్నమే యనమల రామకృష్ణుడు మాటల్లో కన్పించింది. గత ఏడేళ్లుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం ఇదే తెలుగుదేశం పార్టీ తొలుత జగన్ లక్ష కోట్ల అవినీతిపరుడని ప్రచారం చేసింది. 2014 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాకపోయినా ఎక్కువ శాతం మంది ప్రజలు అండగానే నిలిచారు. 2019 ఎన్నికల్లోనూ చంద్రబాబు అదే ప్రచారం చేశారు. 151 సీట్లతో జగన్ అధికారంలోకి వచ్చారు. రెండు ఎన్నికల్లో జగన్ అవీనీతి అనే ప్రచారాన్ని ప్రజలు నమ్మకపోయినా తెలుగుదేశం పార్టీ మాత్రం దానిమీదే ఆధారపడుతున్నట్లుంది. అంతకు మించి దాని దగ్గర మరో అంశం లేనట్లే కన్పిస్తుంది.