YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గిరిజన గురువులుగా 5 నెలలుగా నో జీతాలు

గిరిజన గురువులుగా 5 నెలలుగా నో జీతాలు

విశాఖపట్టణం, జూన్ 26, 
గిరిజన గురుకులం పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులు వేతనాలందక నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు వీరు రెండు వేల మంది ఉన్నారు. 2020ా21 విద్యా సంవత్సరంలో జూన్‌ నుంచి నవంబరు వరకు ఐదు నెలలు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. కరోనా కష్టకాలంలో వేతనాలుంటే బతకడమే కష్టతరంగా మారిన ఈ సమయంలో వేతనాలు లేక గిరిజన గురుకులం ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. కరోనా కాలంలో ఏ పనీ దొరక్క, ఉపాధ్యాయులు కుటుంబాలను పోషించలేక అప్పులపాలవుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి కాలం గడుపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. గిరిజన సంక్షేమశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులకు తమ సమస్యలను ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఇప్పటివరకు వేతనాలు అందలేదు. వీరికి పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని గతేడాది డిసెంబరులో జరిగిన కేబినెట్‌ సమావేశం తీర్మానం చేసింది. అంతేగాక సిఎం జగన్‌ కూడా అధికారులను ఆదేశించారు. ఆదేశాలచ్చి ఆరు నెలలు గడిచినా వేతనాలు మాత్రం అందలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వారిని ఉద్యోగాల్లో కొనసాగించే ప్రక్రియపై అధికారులెవరూ నోరుమెదపడం లేదు. వేతనాలడిగితే ఉద్యోగాల్లోంచి తీసేస్తామని అధికారుల నుంచి వచ్చే బెదిరింపుల వల్ల వారిలో భయం అత్యధికంగా ఉంది. దీంతో గిరిజన గురుకులం ఉపాధ్యాయుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. జూన్‌ 12న ఉపాధ్యాయుల సర్వీసును రెన్యువల్‌ చేయాల్సి ఉండగా, గిరిజన సంక్షేమశాఖ అధికారులు మాత్రం పెండింగ్‌ వేతనాలను అడ్డుపెట్టుకుని రెన్యువల్‌ ఆర్డర్లను ఉద్దేశపూర్వకంగా నిలుపుదల చేస్తున్నారని గిరిజన గురుకులం గురువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇతర గురుకులాల్లో ఉపాధ్యాయులు, ఇతర కేడర్ల ఉద్యోగులకు సర్వీసు రెన్యువల్‌ అయిపోయాయి. కేవలం గిరిజన గురకులంలోని ఉపాధ్యాయులను మాత్రమే రెన్యువల్‌ చేయకుండా ప్రభుత్వం నిలుపుదల చేయడంపట్ల ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాదీ తాము రెన్యువల్‌ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని, అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోందని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా గిరిజన గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. ఇతర గురుకులాల్లో జూన్‌ 12 నుంచి ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ గిరిజన గురుకులం విద్యార్థులు మాత్రం ఆన్‌లైన్‌ విద్యకు నోచుకోలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తు, ఉపాధ్యాయుల ఉద్యోగాలను కాపాడాలని గిరిజన గురుకులం ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులు కోరుతున్నారు.
గిరిజన గురకులం ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయుల రెన్యువల్‌ ఆర్డర్ల ఫైల్‌ను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచాం. కరోనా పరిస్థితుల వల్ల సిబ్బంది కార్యాలయాలకు సరిగ్గా రాకపోవడం వల్ల ఫైల్‌ ఆలస్యమైంది. జులై వచ్చేలోపు రెన్యువల్‌ ఆర్డర్లు ఇచ్చేస్తాం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వేతనాల పెండింగ్‌ ఫైల్‌ను ఆర్థికశాఖకు పంపించాం. కొన్ని కారణాల వల్ల అది ఇంకా పెండింగ్‌లో ఉంది. త్వరలోనే ఆ ఫైల్‌ను కూడా క్లియర్‌ చేసి ఉపాధ్యాయులకు వేతనాలందేలా చర్యలు తీసుకుంటాం. ఉపాధ్యాయులు రెన్యువల్‌, వేతనాలు పెండింగ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Related Posts