YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

నీటి కోసం తంటాలు

నీటి కోసం తంటాలు

వేసవి విజృంభిస్తుండడంతో జగిత్యాల జిల్లాలో నీటికి సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా పలు గ్రామాలను నీటి ఎద్దడి వేధిస్తోంది. వాడకానికి కాదుకదా.. తాగునీరు సైతం దక్కడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కిలోమీటర్ల మేర నడిస్తేనే గానీ.. తాగునీరు దొరకడంలేదని చెప్తున్నవారూ అధికంగానే ఉన్నారు. జిల్లాలో తాగునీటి సమస్యను తొలగించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. అయితే.. బాధితులకు తగినంతగా నీరు సరఫరా చేయడంలో మాత్రం విఫలమవుతోందన్న విమర్శ వినిపిస్తోంది. జిల్లాలోని 21 గ్రామాల్లో ఇప్పటికే అద్దెబోర్లను తీసుకుని నీటి ఎద్దడి గ్రామాల్లో తాగునీటిని అందిస్తున్నారు అధికారులు. కొన్నిరోజుల క్రితం ఇదే అంశాన్ని జిల్లాపరిషత్‌ సమావేశంలో వివరించారు. అయితే ఇంకా అనేక గ్రామాల్లో తాగునీటికి సమస్యలున్నాయని వాటి సంగతేంటన్న ప్రశ్నకు వారి నుంచి సరైన సమాధానం రాలేదని కొందరు చెప్తున్నారు. 

 

జగిత్యాల వాసులు ఎదుర్కొంటున్న సమస్యే.. కరీంనగర్ ప్రజలూ అనుభవిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇప్పటికే తాగునీటి సమస్యలు ఉన్నాయి. మొన్నటికి మొన్న గన్నేరువరం  మండలంలోని ఓ గ్రామంలో మహిళలు తాగునీటి కష్టాలు తీర్చాలని నేతల ముందు నిరసనకు దిగారు. స్థానికంగా వర్షపాతం బాగానే నమోదు అవుతోంది. అయితే వర్షపు నీటిని ఒడిసిపట్టడంలోనూ, ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడంలోనూ విఫలమవుతున్నాం. దీంతో ఏటా తాగునీటికి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వర్షపు నీరు వృధా కాకుండా భూమిలోనే ఇంకిపోయేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా భూగర్భ జలమట్టాలు కొంత మెరుగుపడతాయని.. నీటి కొరత అంత అదుపులో ఉంటుందని చెప్తున్నారు. వాస్తవానికి వర్షపు నీటిని సక్రమంగా వినియోగించుకునే ప్రణాళికలపై ప్రజలకు సరైన అవగాహన లేదు. దీంతో భూగర్భంలోకి ఇంకే నీటి శాతం తక్కువగా ఉంటోంది. అవసరానికి మించి నీటివాడకం విపరీతంగా పెరిగిపోవడం సమస్యలకు దారితీసింది. ఇది సమీప భవిష్యత్తులో పలు అనర్థాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అంశాలపై దృష్టి సారించి జల సంరక్షణ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఈ మేరకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచిస్తున్నారు.

Related Posts