విజయవాడ, జూన్ 26,
ఏపీలో బీజేపీ నోటాతోనే పోటీ పడుతుంది. కానీ ఢిల్లీలో మాత్రం ఆ పార్టీ వెంట అధికార వైసీపీ, విపక్ష టీడీపీ పడతాయని ప్రచారంలో ఉంది. మోడీని పల్లెత్తు మాట అనకుండా నెట్టుకుంటూ రావడంలోనే ఈ రెండు పార్టీల అధినేతల చాకచక్యం చాలా ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే తాము ఎంతలా మద్దతు ఇస్తున్నా బీజేపీ అనుసరిస్తున్న కొన్ని విధానాలు మాత్రం అటు వైసీపీకి, ఇటు టీడీపీకి తెగ చికాకు తెప్పిస్తున్నాయి. ఆ చికాకు నుంచి అంతులేని ఫ్రస్ట్రేషన్ కూడా పుట్టుకొస్తోంది. అందుకే అటూ ఇటూ ఇద్దరు సీనియర్లు ఇండైరెక్ట్ గా బీజేపీ మీద ఒక్క లెక్కన మండిపోతున్నారు.ముందుగా అధికార వైసీపీ ఫ్రస్ట్రేషన్ గురించి చెప్పుకుంటే తన పార్టీ ద్వారా గెలిచి నిత్యం కాలిలో ముల్లు మాదిరిగా నరకం చూపిస్తున్న రఘురమ క్రిష్ణం రాజు మీద వేటు వేయమని ఏడాదిగా కోరుతున్నా పట్టించుకోకపోవడం పట్ల గుస్సా అవుతోంది. ఈ ఏడాదిలో ఎన్నో మార్లు లేఖలు రాశామని, నేరుగా వచ్చి కలిశామని, అయినా ఎందుకు చర్యలు తీసుకోరు అంటూ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు రఘురామక్రిష్ణం రాజు లేఖాస్త్రం సంధించారు. ఇది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులకు, ఫిరాయింపుల చట్టానికి కూడా విరుద్ధమని ఆయన అంటున్నారు. ఈ లేఖ స్పీకర్ కి రాసినా కూడా కేంద్ర పెద్దల వైఖరిని ఇండైరెక్ట్ గా విజయసాయిరెడ్డి ప్రశ్నించేశారు. ఇది మంచి విధానం కాదు అంటూ ఆయన పేర్కొన్న విషయాలు వైసీపీ అసహనానికి అద్దం పడుతున్నాయి.ఇక టీడీపీలో సీనియార్ మోస్ట్ నాయకుడిగా ఉన్న యనమల రామకృష్ణుడు కూడా జగన్ సీబీఐ కేసుల గురించి ప్రస్తావిస్తూ అవి ఎందుకు తొందరగా విచారణకు నోచుకోవడం లేదని ప్రశ్నించారు. జగన్ని విజయమాల్యా, లలిత్ మోడీ వంటి ఆర్ధిక నేరగాళ్ల పక్కన పెట్టి మరీ యనమల ద్వారా టీడీపీ తన అసహనాన్ని చాటుకుంది. కొన్ని కేసులలో వేగం చూపిస్తున్న దర్యాప్తు సంస్థలు జగన్ కేసుల విషయంలో తాత్సారంతో వ్యవహరిస్తున్నాయని కూడా యనమల ఆక్షేపించడం వెనక కేంద్రాన్ని విమర్శించడమే ఉంది. కేంద్రం దన్నుగా ఉంటోందన్న అర్ధం వచ్చేలాగానే యనమల ఈ భారీ డైలాగులు వాడారు.ఈ రెండు అసహనాల వెనక కేంద్ర పెద్దలు, బీజేపీ ఉన్నారనే అర్ధం. ఇక జగన్ కేంద్రానికి పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు కాబట్టి ఆయన మీద ఉన్న సీబీఐ కేసుల వ్యవహారం నత్తనడకగా ఉందని అంతా అంటున్న సంగతి విషయమే. ఇక రఘురామక్రిష్ణం రాజు వ్యవహారం తీసుకుంటే ఆయనకు కూడా బీజేపీ పెద్దల సపోర్ట్ ఉందని ప్రచారం లో ఉంది. లేకపోతే ఏడాది గడుస్తున్నా కూడా స్పీకర్ కనీసం అనర్హత పిటిషన్ మీద ఆయన్ని పిలిచి విచారించకపోవడం విడ్డూరమే కదా. పైగా రాజు ఢిల్లీలో ఏ కేంద్ర మంత్రిని కలవాలనుకుంటే ఆయన అపాయింట్మెంట్ ఈజీగా దక్కుతోంది. మొత్తానికి బీజేపీ వాడకం మామూలుగా లేదు. ఏపీలో అధికార విపక్షాలతో పాటు ఒంటికాయ సొంటి కొమ్ము ఎంపీ రాజుని కూడా అక్కున చేర్చుకుని ఒక్క సీటూ లేని ఏపీలో పాలిట్రిక్స్ బాగానే చేస్తోంది. అదే టైమ్ లో అవతల పక్షం వారి ఫ్రస్ట్రేషన్ కి మాత్రం జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది అంటున్నారు.