లండన్, జూన్ 26, (న్యూస్ పల్స్)
కరోనాను కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా అది ఓ కొత్త మ్యుటేషన్‌తో సవాలు విసురుతూనే ఉంది. తొలిసారిగా మన దేశంలోనే కనిపించిన డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్‌కు కారణమై ఎంత విధ్వంసం సృష్టించిందో మనం చూశాం. ఇప్పుడు అదే డెల్టాలో నుంచి పుట్టుకొచ్చిన మరో వేరియంట్ డెల్టా ప్లస్ భయపెడుతోంది. ఇదే ఇండియాలో థర్డ్ వేవ్‌కు కారణమవుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇండియా దీనిని ఆందోళనకర వేరియంట్‌గా గుర్తించింది. మరి ఈ వేరియంట్ ఎంత ప్రమాదకరం? దీనిని కట్టడి చేయాలంటే ఏం చేయాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.
అసలేంటీ డెల్టా-ప్లస్ వేరియంట్?
ఈ డెల్టా ప్లస్‌కు కారణమైన డెల్టా వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే ఆందోళనకర వేరియంట్‌గా గుర్తించింది. ఇప్పుడు ఇండియాలో కనీసం 10 రాష్ట్రాలు, ప్రపంచంలో పది దేశాలకు విస్తరించిన డెల్టా ప్లస్ (ఏవై.1) వేరియంట్ తొలిసారి మార్చిలో యూరప్‌లో కనిపించింది. ఆ యూకేలో గుర్తించిన తొలి ఐదు కేసులకు సంబంధించిన వ్యక్తులు నేపాల్, టర్కీ నుంచి వచ్చి ఉంటారని ఆ దేశం వెల్లడించింది.డెల్టానే కరోనా వైరస్‌లోని భిన్న జాతిగా గుర్తించారు. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్ కొన్ని మ్యుటేషన్ల వల్ల భిన్నంగా ప్రవర్తించింది. ఇక డెల్టా ప్లస్ అనే మరో వేరియంట్ తన పేరెంట్ అయిన డెల్టా కంటే కూడా భిన్నంగా ఉంది. దీనికి కారణమైన ముఖ్యమైన మ్యుటేషన్‌ను కే417ఎన్‌గా పిలుస్తున్నారు. ఈ మ్యుటేషన్ మానవ కణాలను మరింత గట్టిగా పట్టుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.దీనిని ఆందోళనకర వేరియంట్‌గా గుర్తించడానికి భారత అధికారులు రెండు ముఖ్యమైన కారణాలను చెబుతున్నారు. ఇది చాలా వేగంగా వ్యాపించడం అందులో ఒకటి కాగా.. మరొకటి మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు ఇది లొంగడం లేదు. స్వల్ప నుంచి మోస్తరు లక్షణాలతో ముప్పు ఎక్కువ ఉన్న పేషెంట్లకు ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స అందిస్తున్నారు.ఇప్పుడిదే పెద్ద సమాధానం లేని ప్రశ్నగా ఉంది. నిజానికి కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినప్పుడల్లా దానిపై వ్యాక్సిన్లు సమర్థంగా పని చేస్తాయా అన్న సందేహాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. గతంలోని వేరియంట్ల ఆధారంగా వ్యాక్సిన్లు తయారు చేయడం వల్ల అవి కొత్తవాటిపై ఎలా పని చేస్తాయో అన్న సందేహం ఉంటుంది. అలాగని అవి అసలు పని చేయవనీ చెప్పలేమని నిపుణులు అంటున్నారు.నిజానికి ఇండియాలో ప్రధానంగా ఇస్తున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు ఈ డెల్టా ప్లస్ వేరియంట్‌పై సమర్థంగా పని చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. మరోవైపు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) దీనిపై పరిశోధన చేయనున్నట్లు ప్రకటించాయి.డెల్టా ప్లస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించినా.. ఇప్పటి వరకూ దీనికి సంబంధించి ఎలా సూచనలూ చేయలేదు. డెల్టా వేరియంట్‌లో భాగంగానే ఈ డెల్టా ప్లస్‌ను కూడా తాము ట్రాక్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం ఈ డెల్టా ప్లస్ వేరియంట్‌పై అప్రమత్తమైంది. టెస్టుల సంఖ్య పెంచడం, కాంటాక్ట్‌లను వేగంగా గుర్తించడం, వ్యాక్సినేషన్ వేగం పెంచడంపై దృష్టి సారించాలని నిర్ణయించింది.డెల్టాలాంటి కొత్త వేరియంట్లు కనిపించినప్పుడు బ్రిటన్‌లాంటి దేశాలు వ్యాక్సినేషన్ వేగం పెంచి వ్యాప్తిని కట్టడి చేశాయి. డెల్టా ప్లస్ వేరియంట్ విషయంలోనూ గత వేరియంట్లలాగే అన్ని ముందు జాగ్రత్తలూ తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం పాటించడం తప్పనిసరి.