హైదరాబాద్, జూన్ 26
కరోనా మహమ్మారితో కకావికలమైన ఆర్టీసీ క్రమంగా పుంజుకుంటోంది. అన్‌లాక్‌తో సంస్థ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. జనజీవనం బయటకు రావడంతో ఆక్యుపెన్సీ రేషియో 65 శాతానికి పెరిగింది. వారం రోజుల్లోనే ఆదాయం డబుల్ అయింది. అన్‌లాక్ ముందు రోజువారీ కలెక్షన్ రూ. 4 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ. 8 కోట్లకు చేరింది. కిలోమీటర్‌కు రూ.35 ఆదాయం వస్తోంది. ప్రస్తుతం రోజుకు 20 లక్షల కిలోమీటర్ల మేర బస్సులను తిప్పుతున్నారు. కరోనా, లాక్‌డౌన్‌తో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే బస్సులు నడిచాయి. సడలింపుల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు, ఆ తర్వాత మరికొన్ని రోజులకు సాయంత్రం 6 గంటల నుంచి మాత్రమే తిప్పారు. కరోనా కేసులు తగ్గడంతో 19వ తారీఖు నుంచి లాక్‌డౌన్ ఎత్తేశారు. అదే రోజు నుంచి పూర్తిస్థాయిలో బస్సులు నడుపుతున్నారు. ఇంటర్ స్టేట్ బస్సులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లగ్గాలు, ఇతర ఫంక్షన్లు జరుగుతుండటం, అన్ని ఆఫీసులు తెరుచుకోవడంతో ఆర్టీసీకి ప్రయాణికుల తాకిడి పెరుగుతూ వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కంటే జిల్లాల్లోనే ఆర్టీసీకి మంచి ఓఆర్ నమోదవుతోంది. జిల్లాల్లో ఆర్టీసీకి 5వేల వరకు బస్సులు ఉన్నాయి. ఓఆర్ మంచిగ వస్తుండటంతో వీటన్నింటిని నడుపుతున్నారు. అయితే ఈ బస్సులు ప్రయాణికులకు సరిపోవడంలేదు. దీంతో ఉన్న వాటిల్లోనే కుక్కికుక్కి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం అద్దె బస్సులు నడవడం లేదు. రాష్ట్రంలో 3200 అద్దె బస్సులు ఉండగా,ఇందులో 3000 వరకు జిల్లాల్లోనే ఉన్నాయి. అద్దె బస్సు ఓనర్లకు నాలుగు నెలలుగా బకాయిలు చెల్లించడంలేదు. బిల్లులు చెల్లిస్తేనే బస్సులు నడుపుతామని అద్దె బస్సుల ఓనర్లు అల్టిమేటం జారీ చేశారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌ఎం ఆఫీసుల దగ్గర ధర్నాలు కూడా చేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో కిస్తీలు కట్టలేదని, బస్సులు బయటకు తీస్తే ఫైనాన్స్ వాళ్లు గుంజుకపోతరని హైర్ బస్సు ఓనర్ జగదీశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అద్దె బస్సులు నడిపితే ఆర్టీసికి మరింత కలెక్షన్ పెరిగే చాన్స్ ఉంది.2019 సమ్మె తర్వాత మంచి ఆదాయం గడిస్తున్న ఆర్టీసీని కరోనా పెద్ద దెబ్బ కొట్టింది. కరోనా కంటే ముందు రూ. 14 కోట్ల వరకు కలెక్షన్ వచ్చిన విషయం తెలిసిందే. కరోనా మొదటి వేవ్‌లో బస్సులు నడవకపోవడంతో రూ. 2,400 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత మళ్లీ కోలుకునే దశలో సెకండ్ వేవ్ రూపంలో మరో పిడుగు పడింది. సెకండ్ వేవ్‌లో సుమారు రూ. 600 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనాతో మొత్తం ఆర్టీసీకి సుమారు రూ.3 వేల కోట్ల నష్టం వచ్చింది.