YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

వసూళ్ల పర్వం

వసూళ్ల పర్వం

ఆదిలాబాద్ రెవెన్యూశాఖలో కొందరు వసూళ్ల దందా మొదలెట్టారన్న విమర్శలు ఇటీవలిగా జోరందుకున్నాయి. దస్త్రాల్లో చిన్నపాటి లొసుగులను అడ్డంపెట్టుకుని జనాలను ఆటాడుకుంటున్నారని అంతా అంటున్నారు. రూ.వేలు దండుకుంటూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారని విమర్శిస్తున్నారు. భూ దస్త్రాల ప్రక్షాళన, దళితబస్తీ, అక్రమ మైనింగ్ విషయాలను కాసులు దండుకునేందుకు వినియోగించుకుంటున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే రెవెన్యూశాఖలో అవినీతి 68శాతానికి చేరినట్లు కాగ్‌ నివేదికలో తేలింది. ఈ విభాగానికి చెందిన పలువురు దశలవారీగా మామూళ్లను పంచుకుంటున్నారని స్పష్టమైంది. ఇదిలాఉంటే కొందరు దిగువ స్థాయి సిబ్బందితో పాటూ డివిజన్‌ స్థాయి అధికారులు సైతం ఈ తరహా దందాకు పాల్పడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఇంటిలిజెన్సీ అధికారులు కొందరు అవినీతి పరుల చిట్టాను సిద్ధం చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఏసీబీ, ఆదాయ పన్నులశాఖ అధికారులు దృష్టి సారించడం అక్రమార్కుల్లో ఆందోళన నెలకొన్నట్లు సమాచారం.

 

ఇటీవల ప్రభుత్వం చేపట్టిన  భూ దస్త్రాల ప్రక్షాళన రెవెన్యూ అధికారులకు కాసులు కురిపించింది. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు దీని ద్వారా పరిష్కరించుకునే అవకాశం ప్రజలకు దొరికింది. అయితే రెవెన్యూ సిబ్బంది మాత్రం ఈ అంశాన్ని జేబు చేసుకునేందుకు ప్రాధాన్యతనిచ్చారు. తమకు డబ్బులు ఇబ్బడిముబ్బడిగా అందేలా లేనిపోని సమస్యలు సృష్టించారని స్థానికుల ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే సిబ్బందిలో పలువురు ఉద్దేశపూర్వకంగానే కొన్ని భూములను వివాదాస్పదం చేశారని అంతా అంటున్నారు. మళ్లీ వాటిని పరిష్కరించాలంటే భారీగా డబ్బులు వసూలు చేశారని విమర్శిస్తున్నారు. సమస్యలు సృష్టించేది.. పరిష్కరించేది వాళ్లేనని అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇప్పుడు వివాదంలో పడితే.. మళ్లీ ఎన్నాళ్లకో పరిష్కారం అనుకుని పలువురు రైతులు వాళ్లు అడిగినంత ఇచ్చేసుకుంటున్నారని చెప్తున్నారు. సాదాబైనామాలు కూడా రెవెన్యూ శాఖకు కాసులు కురిపించాయని తెలుస్తోంది. పాత తేదీలతో భారీగా సెటిల్మెంట్లు చేసి.. డబ్బులు వసూలు చేశారని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Related Posts