అమలాపురం
ఒకపక్క కరోనా కరాళ నృత్యం చేస్తుంటే మరోపక్క ప్రైవేట్ బస్సులు అమలాపురం నుండి హైదరాబాద్ యథేచ్ఛగా ప్రయాణికులను తరలిస్తూ సొమ్ములు చేసుకుంటున్నాయి. మరోపక్క ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రైవేట్ బస్సులు దర్జాగా దోచుకుంటున్నాయి. అయితే అమలాపురం నుండి హైదరాబాద్ కు సుమారు 500 కిలోమీటర్లు ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖ, పోలీసు, రెవెన్యూ అధికారులు వీటిని అడ్డుకోకపోవడం దారుణం. కరోనా వైరస్ ను పెంచడంలో అధికారులే కీలకపాత్ర పోషిస్తున్నారని పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. నిబంధన ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా హైదరాబాద్ కు ప్రయాణించే ప్రయాణికుల వద్ద నుండి 1500 నుండి 2000 రూపాయలు వరకు అధిక మొత్తంలో సొమ్ము చేసుకుంటూ అధికారుల కళ్ళ ముందు నుండే బస్సులు ప్రయాణిస్తుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిబంధనలు ఉండగా తూర్పుగోదావరి జిల్లాలో మరింత ఉదృతంగా ఉండడంతో 2 గంటల వరకు మాత్రమే పరిమితమైంది.. అయినప్పటికీ ప్రైవేట్ బస్సులు నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇలా ఉంటే కరోనా విజృంభించదా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.