జెనీవా జూన్ 26
పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ ప్రపంచ దేశాలను కోరారు. వ్యాక్సినేట్ అయిన సంపన్న దేశాలు మళ్లీ తెరుచుకుంటున్నాయని, కోవిడ్‌తో రిస్క్ లేనటువంటి యువతకు కూడా వ్యాక్సిన్లు ఆ దేశాలు ఇస్తున్నాయని ఆయన అన్నారు. కానీ అతి పేద దేశాలకు ఇంకా వ్యాక్సిన్లు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ టీకాల పంపిణీలో ప్రపంచవ్యాప్తంగా విఫలమైనట్లు టెడ్రోస్ తెలిపారు. ఆఫ్రికాలో పరిస్థితి దారుణంగా ఉందని, గత వారంతో పోలిస్తే ప్రస్తుతం ఇన్‌ఫెక్షన్లు, మరణాలు 40 శాతం పెరిగాయని, పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, డెల్ట్ వేరియంట్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నట్లు టెడ్రోస్ చెప్పారు. వ్యాక్సినేషన్ విషయంలో ఓ ప్రపంచంగా మన విఫలమవుతున్నాయని ఆయన అన్నారు.
జెనీవాలో మీడియాతో మాట్లాడిన టెడ్రోస్.. అతి పేద దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడంలో కొన్ని అగ్రదేశాలు విఫలమైనట్లు ఆయన చెప్పారు. అయితే ఏయే దేశాలు నిర్లిప్తంగా ఉన్నాయన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. గతంలో ఆఫ్రికా దేశాలు ఎయిడ్స్ సంక్షోభ సమయంలో సరైన రీతిలో వ్యవహరించలేదన్న అంశాలను పక్కనపెట్టాలన్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ల సరఫరా సమస్యగా మారిందని, ఆఫ్రికా దేశాలకు వ్యాక్సిన్లు ఇవ్వాలంటూ ఆయన వేడుకున్నారు. ఉన్నవాళ్లు, లేనివాళ్ల మధ్య తేడా పెరుగుతోందని, ఇది అసమానతలను ఎత్తి చూపుతోందన్నారు.