న్యూఢిల్లీ జూన్ 26
ప్రజా విశ్వాసం కోసం న్యాయస్థానాలు పని చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపు నిచ్చారు. సామాన్యులకు న్యాయాన్ని అందించడంలో ప్రతి ఒక్కరూ తమ తోడ్పాటు అందించాలని అన్నారు. శనివారం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ రాసిన ఎనమిలీస్ ఇన్ లా అండ్ జస్టిస్ పుస్తకాన్ని జస్టిస్ రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ... న్యాయస్థానాలపై సామాన్యులకు నమ్మకం పెరిగేలా.. అనేక విషయాలను జస్టిస్ రవీంద్రన్ తన పుస్తకంలో ప్రస్తావించారని సీజేఐ తెలిపారు. న్యాయశాస్త్రంలో ఉన్న లోపాలు సరి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రస్తావించారు. తన పుస్తకం ద్వారా న్యాయస్థానాలపై ప్రజల్లో విశ్వాసం నెలకొల్పారని సీజేఐ పేర్కొన్నారు. న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రజా ప్రయోజనాల కోసం పని చేయడం హర్షణీయం అని కితాబిచ్చారు. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రోజు జస్టిస్ రవీంద్రన్ రాసిన లేఖను ఈ సందర్భంగా జస్టిస్ రమణ గుర్తు చేసుకున్నారు. ఆ లేఖలో జస్టీస్ రవీంద్రన్ ప్రస్తావించిన ప్రతి అంశాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు సీజేఐ ఎన్వీ రమణ వెల్లడించారు.