విజయనగరం, జూన్ 26,
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుని టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీవిజయసాయి రెడ్డి మరోమారు ఆయనపై విరుచుకుపడ్డారు. ఆయన్ని వదిలేది లేదన్నట్లు ఎంపీ ఘాటు విమర్శలతో రెచ్చిపోయారు. స్త్రీలకు ఆస్తి హక్కు తమ పూసపాటి రాజ్యాంగంలో లేదని చెబితే చట్టం ఒప్పుకోదని విజయసాయి అన్నారు. ఏ బైలా అయినా.. ఫ్యామిలీ లా అయినా చట్టాలనికి లోబడి ఉండాలిన భారత రాజ్యాంగం నిర్దేశించిందని ఆయన గుర్తు చేశారు. రెండింటికీ మధ్య వివాదం వస్తే చట్టం, రాజ్యాంగమే చెల్లుబాటవుతుందని విజయసాయి అన్నారు. పురాత దురాచారాలైన సతీసహగమనం, వరకట్నం, బహు భార్యత్వం కుటుంబ ఆచారమంటే చట్టం ఒప్పుకోదన్నారు. స్త్రీలకు ఆస్తి హక్కు ఇవ్వడం.. మా సంస్కృతిలోనూ, పూసపాటి రాజ్యాంగంలోనూ లేదంటే చెల్లుతుందా అశోక్? అని ఎంపీ సూటిగా ప్రశ్నించారు.
ఎన్టీఆర్ వెన్నుపోటు వ్యవహారంలోనూ అశోక్ గజపతి పాత్ర ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు విజయసాయి. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే.. అశోక్ గజపతి కత్తి అందించి ఖతం చేశాడని విమర్శించారు. అందుకే ఎన్టీఆర్ పార్టీ నుంచి గెంటేసిన వారిలో మొదటిపేరు బాబుదైతే, రెండోది అశోక్‌దేనని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ శాసన సభ్యత్వాన్నీ రద్దు చేయాలంటూ అప్పటి స్పీకర్‌కు లేఖ రాసి ఆయనపై చెప్పులు కూడా విసిరాడు. అశోక్ గజపతిది అన్నం పెట్టిన వ్యక్తికే సున్నం రాసిన రక్త చరిత్ర అని విజయసాయి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు