ఎండలు మండుతున్నాయి.. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వారం రోజుల క్రితం వరకు చల్లబడిన వాతావరణం రెండురోజులుగా వేడెక్కింది. మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జిల్లాలో ప్రధాన పట్టణాల్లో సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండ వేడిమి తగ్గకపోగా వడగాలులు వీస్తున్నాయి.జిల్లాలో గరిష్టంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.వాతావరణంలోని మార్పులతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 40 డిగ్రీలను దాటేసిన ఉష్ణోగ్రతలు జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మండుఎండలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ఎండవేడిమిని భరించలేకపోతున్నారు. గత రెండు మూడురోజుల క్రితం వరకు అకాలవర్షంతో జిల్లాలో కొన్నిచోట్ల చల్లబడినా మంగళవారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి.గంట గంటకూ ఉష్ణోగ్రతలు పెరగడంతో మధ్యాహ్నం వేళల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఆయా పట్టణాల్లో ప్రధాన రహదారులన్నీ కూడా జనం లేక బోసిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇళ్లనుంచి బయటకు వచ్చేవారు ఎండవేడిమి తట్టుకునేందుకు గొడుగులు, చేతిరుమాళ్లు, టోపీలు, స్కార్ఫ్‌లు ధరిస్తున్నారు. ఎండవేడిమి తగ్గకపోగా వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రోడ్డు పక్కన చిరువ్యాపారులు, కూలీనాలీ చేసుకుని జీవించేవారు, రిక్షా కార్మికులు ఎండవేడిమి తట్టుకోలేకపోతున్నారు.మరోవైపు ఎండకు వినియోగదారులు రావడంలేదని వ్యాపార లావాదేవీలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. సామాన్య, మధ్యతగరతి ప్రజలు గతంలో కూలర్లు, ఫ్యాన్లతో సరిపెట్టుకునేవారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఎండవేడిమిని భరించలేక ఏసీలు ఏర్పాటు చేసుకుని ఉపశమనం పొందుతున్నారు.
ఈ ఏడాది కూడా జిల్లాలో వడదెబ్బ ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే వారం రోజుల్లో జిల్లాలో గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ ఐఎండీ హెచ్చరిస్తున్నారు.
గతేడాది వడదెబ్బ కారణంగా జిల్లాలో 35 మంది మృతి చెందారు. అయితే ఈ ఏడాది ఎండవల్ల వడదెబ్బ బాధితులతో పాటు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో భానుడి ప్రకోపానికి తట్టుకునేలా జనాలు నిలబడాలంటే వైద్యుల సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది.