శ్రీకాకుళం, జూన్ 28,
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తోందా ? ఆయనపై గుసగుసలు పెరిగాయా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలోనే ఈ తరహా వ్యాఖ్యలు… ఆయనపై గుసగుసలు పెరుగుతుండడం గమనార్హం. ప్రస్తుతం అచ్చెన్నాయుడు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కొందరు నేతలు కూడా దూరమవుతున్నారని తెలుస్తోంది. అదే సమయంలో కేడర్‌లోనూ అచ్చెన్నపై గతంలో ఉన్న ఆదరణ కనిపించడం లేదని తెలుస్తోంది.మరి దీనికి కారణం ఏంటి ? ఎందుకు అచ్చెన్నాయుడుపై ఇంత వ్యతిరేకత సైలెంట్‌గా పెరుగుతోంది ? అనేది ఆసక్తిగా మారింది. విషయంలోకి వెళ్తే.. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి వీచినా అచ్చెన్నాయుడు విషయం సాధించారు. ఈ విజయంలో టెక్కలి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, సీనియర్లు ఎంతో కృషి చేశారు. అయితే.. తొలి ఏడాది తర్వాత అచ్చెన్నాయుడు వీరిని పట్టించుకోవడం మానేశారట. తమకు ఇప్పుడు కనీసం అందుబాటులో కూడా లేకుండా పోతున్నారని.. ఫోన్ చేసినా.. స్పందించడం లేదని క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక, కరోనా సమయంలో అనేక ఇబ్బందులు పడుతున్న తమకు కనీసం ఏదో ఒక రూపంలో ఆదుకునేందుకు కూడా అచ్చెన్నాయుడు ప్రయత్నించ లేదని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్లు, అధికార పార్టీ వాళ్లు ఉన్నంతలో ఏదో ఒక కార్యక్రమం చేశారు. కానీ టెక్కలిలో అచ్చెన్నాయుడు కేడర్‌ను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఆయన కేవలం తనపై ఉన్న కేసులపైనే దృష్టి పెడుతున్నారని అంటున్నారు. ఇటీవల అచ్చెన్నాయుడు ఒక కార్యక్రమానికి సంబంధించి ప్లాన్ చేసినప్పుడు కేవలం పది మంది మాత్రమే హాజరు కావడం వారిలో ఉన్న ఆవేదనకు అద్దం పడుతోందని అంటున్నారు పరిశీలకులు.వైసీపీ టెక్కలి నియోజకవర్గంపై గట్టిగా ఫోకస్ చేసింది. అచ్చెన్నాయుడుకు బలమైన అనుచరులుగా ఉన్నవారిపై కేసులు, ఇతర అస్త్రాలను ప్రయోగిస్తోంది. వారు దారికి రాకపోతే రకరకాలుగా టార్గెట్ చేస్తోందని స్థానికంగా పార్టీ నేతలు వాపోతున్నారు. ఒకరిద్దరు పార్టీ మారినా కూడా చాలా మంది అచ్చెన్నాయుడు, టీడీపీపై అభిమానంతో పార్టీలోనే ఉంటున్నారు. తాము ఇన్ని కష్టాలు పడుతున్నా అచ్చెన్న మాత్రం స్థానిక నేతల కష్టాలను పట్టించుకోకపోవడం, వారు అధికార పార్టీ టార్గెట్లతో ఇబ్బందుల్లో ఉంటే ఇటువైపు చూడకపోవడంతో వారు అసహనంతోనే ఉన్నారు. అచ్చెన్నాయుడు టెక్కలి కేడర్ విషయంలో ఇలా వ్యవహరిస్తే ఆయనకు మొదటికే మోసం తప్పదేమో ? మొత్తంగా చూస్తే.. గతంలో ఉన్న ఆదరణ.. అచ్చెన్నకు తగ్గుతోందనేది వాస్తవం అంటున్నారు.