అమరావతి జూన్ 28, జాబ్ లెస్ క్యాలెండర్ పై విద్యార్థి యువజన సంఘాల నిరసన... మంత్రి పెద్దిరెడ్డి, అవంతిల ఇళ్ళ ముట్టడికి యత్నం... మంత్రి బొత్స ఇంటి పరిసరాల్లో పోలీస్ బందోబస్తు.
జాబ్ లెస్ క్యాలెండర్ వద్దని.. జాబ్ ఉన్న క్యాలెండర్‌ను విడుదల చేయాలని కోరుతూ సోమవారం ఉదయం తిరుపతిలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. ఎంఆర్‌పల్లి సర్కిల్ నుంచి తిరుపతిలోని మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వరకు విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఒకానొక దశలో మంత్రి నివాసం ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. దీంతో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
విశాఖపట్నం: జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను నిరసిస్తూ.. సీతమ్మధారలో మంత్రి అవంతి శ్రీనివాసరావు నివాసం ముందు ఏపీ నిరుద్యోగ జేఏసీ నిరసన చేపట్టింది. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంత్రి అవంతి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అరెస్టు చేశారు. పాదయాత్రలో నిరుద్యోగులకు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న రెండు లక్షలకుపైగా ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది.
విజయనగరం: మంత్రి బొత్స ఇంటి పరిసరాల్లో విస్తృతంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలపై పోలీస్ ఆంక్షలు విధిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జాబ్ కార్డుపై నిరుద్యోగుల్లో నిరసన కొనసాగుతోంది. మంత్రి బొత్స ఇంటి ముట్టడిపై నిరుద్యోగుల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు ముందుగానే పసిగట్టారు. దీంతో నిరసనకారులను ముందస్తు గృహ నిర్బంధం చేశారు.