జమ్ము జూన్ 28
ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై డ్రోన్ దాడి జరిగిన మరుసటి రోజే మరో రెండు డ్రోన్లు కలకలం రేపాయి. జమ్ములోని కాలుచాక్ మిలిటరీ స్టేషన్‌లో ఆదివారం అర్ధరాత్రి కనిపించాయి. రాత్రి 11.30 నిమిషాలకు ఓ డ్రోన్ ఆర్మీ బేస్‌పై ఎగురుతూ కనిపించగా.. మరొకటి అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల ప్రాంతంలో కనిపించింది. వెంటనే అలెర్ట్ అయిన ఆర్మీ జవాన్లు వాటిపై ఫైరింగ్ జరిపారు. జమ్ము పఠాన్‌కోట్ నేషనల్ హైవేపై కాలుచాక్-పూర్మాండల్ ప్రాంతంలో రెండు క్వాడ్‌కాప్టర్స్ కనిపించాయి. కాలుచాక్ మిలిటరీ స్టేషన్‌కు దగ్గరగా ఎగురుతూ కనిపించాయి అని పోలీసులు వెల్లడించారు.ఆర్మీ జవాన్లు 20-25 రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే చీకట్లో ఆ రెండు డ్రోన్లు తప్పించుకుని వెళ్లిపోయాయి. వాటిని కనిపెట్టడానికి పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. జమ్ము ప్రాంతంలో ముఖ్యంగా ఆర్మీ స్టేషన్లలో హై అలెర్ట్ ప్రకటించారు. జమ్ములో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై తొలిసారి డ్రోన్ దాడి జరిగిన మరుసటి రోజే ఇలా మరో రెండు డ్రోన్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. డ్రోన్లతో దాడి చేయడం అనేది ఇదే తొలిసారి. ఆదివారం తెల్లవారుఝామున రెండు పేలుళ్లు జరిగాయి. ఈ ఉగ్రదాడిపై జమ్ముకశ్మీర్ పోలీసులు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు జరుపుతున్నారు.