YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సృష్టి క్రమం ప్రశ్నోపనిషత్తు

సృష్టి క్రమం ప్రశ్నోపనిషత్తు

*అథ కబన్దీ కాత్యాయన ఉపేత్య పప్రచ్ఛ! భగవన్ కుతో హ వా ఇమాః ప్రజాః ప్రజాయ న్త ఇతి.*

*గురువు చెప్పిన రీతిలో ఒక సంవత్సరం తపస్సు ముగించిన తరువాత, కత్యుడి కుమారుడైన కబంధి పిప్పలాదుడి దగ్గరకు వెళ్ళి మొదటి ప్రశ్నగా..*

*హే భగవన్! ఈ మానవాళి అంతా ఎక్కడ నుంచి పుడుతున్నారు? ” అని అడిగాడు. అంటే ఈ ప్రాణికోటి ఎక్కడ నుంచి వచ్చింది అనేదే ప్రశ్న.*

*అంటే ఈ సృష్టి ఎలా జరిగింది? ఆలోచనా పరుడైన ఏ మానవునికైనా కలిగే సందేహమే ఇది.*

*అయితే నిర్గుణ పరబ్రహ్మాన్ని అన్వేషిస్తూ ఆ క్రమం లో వచ్చిన సందేహాల నివృత్తి కోసం వచ్చిన ముముక్షువు సృష్టి క్రమం గురించి ఎందుకు ప్రశ్నించి ఉంటాడు?*

*ఐహిక సుఖాలు, కామ్య కర్మల నుంచి వచ్చే స్వర్గాదిసుఖాలు (ఇహపరాలు) రెండూ బ్రహ్మ జ్ఞానానికి ఆటంకాలే అని నిర్ణయించు కొనేటందుకు ఐహికమైన సృష్టి క్రమం గురించి అడిగిన ప్రశ్న ఇది.*

*కబంధి యొక్క ప్రశ్నకు పిప్పలాదుడిలా సమాధానమిచ్చాడు.*

*తస్మై న హో వాచ, ప్రజాకామో వై ప్రజాపతిః స తపో తప్యత, స తప స్తప్త్యా స మిధున ముత్వాదయతే, రయిం చ ప్రాణం చేత్యేతౌ  యే బహుధా ప్రజాః కరిష్యత ఇతి!!*

*ఓ కబంధీ! సకల ప్రాణులను సృష్టించాలని భావించిన ప్రజాపతి (సృష్టికర్త) అందుకోసం తీవ్రంగా తపస్సు చేసాడు.*

*సృష్టికి కావలసినవి చంద్రరూపమైన (రయి)ద్రవ్యం మరియు సూర్య రూపమైన ప్రాణం కావాలని తపః ప్రభావం వల్ల స్ఫురించాయి.*

*తరువాత ఆకాశాన్ని ప్రాణాన్ని సృష్టించాడు. అంటే జడ చైతన్యాలను సృష్టించాడు.*

*తాను సృష్టించిన ఈ రెండూ ఒకదానితో ఇంకొకటి కలసి ఎన్నో రకాల జీవులు సృష్టింపబడతాయని భావించాడు.*

*లీ ఆదిత్యో హ వై ఫ్రాణో రయిరేవ చన్ద్రమాః రయిర్వా ఏత! త్సర్వం యన్మూర్తం చామూర్తం చ తస్మా న్మూర్తి రేవ రయిః!”*

*సూర్యుడు ప్రాణశక్తి అయితే చంద్రుడే రయి(రయి అంటే ఆకారమున్న వస్తువు). జడ పదార్ధం. అలాగే స్థూలమైన వస్తువులు, సూక్ష్మమైన వస్తువులు, ఇలా లోకంలో ఉన్న సమస్తం జడ పదార్ధాలే. వస్తువు అంటేనే జడపదార్ధమన్నమాట.*

*మూర్తామూర్తములతో కూడుకొన్నదే జగత్తంతా. మూర్తములు ఆకారము కలవి (పృథివి, అగ్ని, జలం మొ..) అమూర్తములంటే నిరాకారమైనవి, వాయువు, ఆకాశం మొ..) సూక్ష్మమైనవి.*

*సూర్య కిరణాల స్పర్శతో కర్మప్రేరణ, చంద్ర కిరణాల స్పర్శతో నిద్రకు ప్రేరణ లభిస్తాయనేది మన అనుభవం.*

*ఆదిత్యుడే ప్రాణం. ఆదిత్యుడే ఈ విశ్వ రూపుడైన వైశ్వానరుడు. ఒక అగ్ని గోళంలా ఉదయిస్తాడు.*

*ఇదేవిషయాన్ని ఋగ్వేదంలో ఉదయించే సూర్యుని “చిత్రం దేవానాముదగాదనీకం….” అనేమంత్రంలో ఎంతో అందంగా వర్ణించారు.*

*ఉదయించే సూర్య కిరణాలలో రక్త శ్వేతాది సప్త వర్ణాలు నిగూఢంగా ఉండి దీప్తిమంతాలై లోకాలను ప్రకాశింపజేసే కిరణ సముదాయం మహాసైన్యంలా ఒక్కసారిగా చిత్రం గా ఉదయించింది అని.*

*ప్రాణుడే అగ్ని. ప్రజల ప్రాణం సూర్యుడే. సూర్యుడే శక్తి. సూర్య మండలం నుండే అన్ని గ్రహాల్లోని చరాచర ప్రాణికోటికి శక్తి ప్రసరింప బడుతుంది అనే సత్యాన్ని విజ్ఞానులు తెలుసుకొన్నారు. జీవు లందరకీ ప్రాణమైన ఈ సూర్యుడు నిత్యం ఉదయిస్తున్నాడు.*

*సూర్యుడు అయిదు పాదాలతో వుంటాడు. ఆ పితృదేవుడు (సూర్యుడు) పన్నెండు రూపాలను ధరిస్తాడు. ఏడు చక్రాలు, ఆరు ఆకులతో ఉన్న రధంలో సంచరిస్తాడని కొందరు చెబుతారు. ఆయనే పైనుంచి వర్షాన్ని కురిపిస్తాడని చెబుతారు. ఆ సూర్య భగవానుడే సర్వజ్ఞుడు.*

*సూర్య చంద్రులను సృష్టించిన ప్రజాపతి కాల స్వరూపుడే కదా! ఈ కింది మంత్రాలలో ఉత్తరాయణ దక్షిణాయనములు సంవత్సరములోను, శుక్ల కృష్ణ పక్షములు మాసములోను, అహోరాత్రములు దినములోను ఏరీతిగా సృష్టికి, మోక్షానికి ఉపయుక్తములో తెలియ చెప్పారు.*

*సంవత్సరోవై ప్రజాపతిః- ఈ సృష్ఠికర్త, ప్రజాపతి, కాలంలోని భాగమైన సంవత్సర మవుతూంటే, ఆయనకు దక్షిణాయనము (జడము), ఉత్తరాయణము (ప్రాణము) అని రెండు మార్గాలున్నాయి.*

*సంతానాన్ని కోరుకొనే ఋషులు యాగాలు, సత్కర్మలు, గొప్పవైన కార్యాలు చేసి దక్షిణాయన మార్గాన చంద్రలోకానికి వెడుతున్నారు. వీరు జనన మరణ చక్రానికి బద్ధులై ఉంటారు.*

*ఆత్మను తెలుసు కోవాలను కొనేవారు తపస్సు, బ్రహ్మచర్యం, నియమనిష్ఠలతో కూడిన జీవితం, ధ్యానం, తపస్సు మొదలగునవి ఆచరించి తద్వారా ఉత్తరాయణ మార్గంలో ప్రవేశించి సూర్యలోకాన్ని చేరుకొంటారు. ఈ మార్గంలో వెళ్ళిన వారు అమరులౌతారు.*

*మాసోవై ప్రజాపతిః- సంవత్సరంలో ఒక భాగమైన మాసం ఆ ప్రజాపతి (సృష్ఠికర్త) స్వరూపం. మాసంలో రెండు పక్షాలుంటాయి. కృష్ణపక్షం (రయి, జడపదార్ధం) శుక్లపక్షం (ప్రాణం, చైతన్యం). ఋషులుతమ యజ్ఞ యాగాదులను, జపతపాదులను ప్రాణ స్వరూపమైన శుక్ల పక్షంలోనే చేస్తారు.*

*అహోరాత్రోవై ప్రజాపతిః – రోజులో భాగమైన రాత్రి పగలు కూడా ప్రజాపతి స్వరూపమే. పగలు అంటే సూర్యుని వెలుగు ఉండే వేళ కర్మ కోసం, రాత్రి అంతర్ముఖత్వం (తపస్సు) కోసం అనేది సృష్ఠి నియమమని శ్రీ యోగి అచ్యుతుల బోధన.*

*ఈ ఉపనిషత్తు నియమబద్ధమైన గృహస్త జీవితానికే ప్రాధాన్యత నిచ్చింది. ఎవరైతే ప్రాణ స్వరూపమైన పగటిపూట స్త్రీ సంభోగాన్ని జరుపుతారో వారు ప్రాణాన్ని నష్టపరచుకొంటారు. రాత్రి సమయంలో స్త్రీ సంగమం బ్రహ్మ చర్యంతో సమానమని స్పష్ఠ పరచింది.*

*అన్నం వై ప్రజాపతిః- రాత్రి పగలే కాదు అన్నం కూడా ప్రజాపతి రూపమే. ఆహారం గా ఉండే అన్నం నుంచే రేతస్సు(వీర్యం) రూపొందుతుంది.*

*ఆ రేతస్సు నుండే సకల జీవులు ఉద్భవిస్తాయి.*

*ఈ విధంగా ప్రజాపతి రూపొందించిన వ్రతాన్ని ఎవరు నియమంగా పాటిస్తారో అలాంటివారే మిథునం ద్వారా జంటని రూపొందిస్తారు.*

*ఎవరిలో బ్రహ్మచర్యం, తపస్సు, సత్యనిష్ఠ, ప్రతిష్టింపబడి ఉంటాయో అతనికి మాత్రమే బ్రహ్మలోక ప్రాప్తి అనగా స్వర్గం ప్రాప్తిస్తుంది.*

*కాని వంచన, మోసం, అసత్యం లాంటి దుర్గుణాలు ఉన్నవారికి సాధ్యం కాదు.*

Related Posts