ఉత్తరభారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా కురిసిన వర్షాలే అక్కడ చలి మరింత పెరగడానికి కారణమైనాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న మంచు....గడ్డకట్టిస్తున్న చలితో వణికి పోతున్న కశ్మీరులోయలో తాజాగా వర్షాలు పడవచ్చని వాతావరణ విభాగం మంగళవారం తెలిపింది. విపరీతమైన మంచుమూలంగా కొన్నిప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 19.2 డిగ్రీల సెల్సియస్‌తో కార్గిల్ గడ్డకట్టిపోతోంది. సమీపంలోని లే అయితే 14 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో వణికిపోతోంది. పంజాబ్, హరియాణాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం తేలికపాటి వర్షం కురిసింది. పంజాబ్‌లోని అమృతసర్, లూధియానా, పాటియాలాలు చలికి వణికిపోతున్నాయి. యూపీలోని కొన్ని ప్రాంతాల్లో మంచు తీవ్రత ఓ మోస్తరుగా ఉంది.
ఇక, దేశరాజధాని దిల్లీలో గజగజ వణికించే చలికి తేలికపాటి వర్షం...మంచు తోడై ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం సాయంత్రం 5.30 వరకూ 4.4 మిల్లీమీటర్ల వర్షం పడినట్లు సఫ్దర్‌జంగ్ పరిశీలనశాల వెల్లడించింది.