YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రెండు పార్టీలో రచ్చ మొదలు

రెండు పార్టీలో రచ్చ  మొదలు

హైదరాబాద్, జూన్ 29, 
టీఆర్ఎస్, టీడీపీలో కుదుపు మొదలైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ఎదురు లేదని భావించిన గులాబీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఊహించని విధంగా పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వడంతో రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అసంతృప్తి నేతలు రేవంత్ రెడ్డి పక్షాన చేరే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఆశావహులను బుజ్జగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.టీఆర్ఎస్‌లో కీలకంగా వ్యవహరించి పదవులు దక్కని ఆశావహులు అసంతృప్తిగా ఉన్నారు. పదవులు పక్కనబెడితే కనీసం నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోగా, ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీలకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పార్టీ మారాలా? ఇంకా కొంత సమయం వేచి చూడాలా? అనే ధోరణిలో ఉన్నారు. వారంతా అదును కోసం వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో టీపీసీసీగా రేవంత్ రెడ్డి నియామకం అవ్వడంతో గులాబీ నేతలు అప్రమత్తం అవుతున్నారు. అసంతృప్తి నేతలు రేవంత్ వైపు వెళ్లకుండా ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. త్వరలోనే పార్టీ అధిష్టానం జిల్లాల వారీగా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.టీడీపీ అధికారంలో లేకపోయినా గ్రామస్థాయిలో నేటికీ కార్యకర్తలు ఉన్నారు. నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా రాజకీయ అనుభవం ఉన్న వారితో రేవంత్ రెడ్డికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఇప్పటికీ కొంత మంది సీనియర్ పొలిటీషియన్లు టీటీడీపీలోనే ఉన్నారు. వీరు నిత్యం రేవంత్ రెడ్డికి టచ్‌లోనే ఉంటున్నారు. టీపీసీసీ పగ్గాలు రేవంత్ చేపట్టిన తర్వాత ఈ నాయకులు కాంగ్రెస్‌లో చేరుతారా అనేది ఉత్కంఠను రేపుతోంది.అయితే గతంలో టీడీపీలో చురుకుగా పనిచేసిన వారు.. అనుభవం ఉన్న నేతలను త్వరలోనే రేవంత్ రెడ్డి కలవనున్నట్లు సమాచారం. దీనికితోడు గతంలో టీడీపీలో ఉండి.. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో కొనసాగుతున్న పలువురు నేతలతో నేటికీ రేవంత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం చర్చనీయాంశం. టీటీడీపీ‌పై చంద్రబాబు నాయుడు కూడా అంతగా యాక్టివ్‌గా లేకపోవడంతో.. ఇప్పుడున్న వారంతా రేవంత్ వైపు మొగ్గు చూపితే కాంగ్రెస్ పుంజుకున్నట్లేనని పలువురు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. ఇదే విషయంపై అప్రమత్తమైన టీఆర్ఎస్ అధిష్టానం రేవంత్ వెంటొచ్చే నాయకుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. వారిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతోంది.టీఆర్ఎస్‌లో ఆందోళన మొదలైందని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పకనే చెప్పారు. రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నాడని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కలేనని పేర్కొనడంతో కొంత ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ నేతలపై రేవంత్ గురి పెట్టారు. దీనిని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ అధిష్టానం త్వరలోనే కొంతమంది నేతలకు బాధ్యతలు అప్పగించి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే రాష్ట్రంలో సంతరించుకుటున్న రాజకీయ పరిణామాలను ప్రతిపక్షాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. కొంతమంది నేతలు రేవంత్‌కు ప్రజల్లో, యూత్‌లో క్రేజ్ ఉండడంతో ఆయన పక్షాన చేరే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts