YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వెంకటరెడ్డి... దారెటు

వెంకటరెడ్డి... దారెటు

నల్గొండ, జూన్ 29, 
టీపీసీసీ పదవిని చివరి వరకు ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేత నల్గొండ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. రాష్ర్ట రాజకీయాల్లో కోమటి రెడ్డి బ్రదర్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ పగ్గాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అధిష్టానాన్ని మచ్చిక చేసుకునేందుకు చాలా రోజులు ఢిల్లోనే మకాం వేశారు. కానీ ఆయన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో… కాంగ్రెస్ అధిష్టానం మరో సహచర ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది. దీంతో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కన్న కలలన్నీ కల్లలయ్యాయి. ఇన్నాళ్లు ఊహల లోకంలో విహరించిన ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా షాక్ ఇచ్చింది.కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతో అలకబూనిన కోమటి రెడ్డి అధిష్టానానికి తన విముఖత తెలిసేలా ఘాటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలంతా ముక్కున వేలేసుకునేలా.. అసలు టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి డబ్బులకు అమ్ముడు పోయిందని బాంబు పేల్చారు. అంతటితో ఆగకుండా తన వద్ద ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని కుండ బద్దలు కొట్టారు. త్వరలోనే అందరి ముందు ఆధారాలు బయట పెడతానని స్పష్టం చేశారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలతో అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. గాంధీ భవన్ గడప తొక్కనన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేశం ఎంతోకాలం ఉంటుందని అనుకోకూడదు. తనకు పీసీసీ చీఫ్ పదవి దక్కలేదన్న ఆగ్రహంతో కొన్ని పరుష వ్యాఖ్యలు చేసి ఉండకపోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారే ఆలోచన కూడా చేయకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ, సీడబ్ల్యూసీలో పదవులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దక్కే అవకాశాలున్నాయి. దీంతో ఆయన అన్నీ మర్చిపోయి గాంధీభవన్ గడప ఎక్కవచ్చు.నిజానికి రేవంత్ రెడ్డికంటే కాంగ్రెస్ లో అనేకమంది సీనియర్ నేతలున్నారు. పార్టీనే నమ్ముకుంటూ అధికారంలో లేకపోయినా కొనసాగుతూనే ఉన్నవారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల, గాంధీ కుటుంబం పట్ల విధేయతను కనపర్చే వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సహజంగా ఆయన పీసీసీ చీఫ్ పదవి దక్కుతుందని ఎంతో ఆశపెట్టుకున్నారు. ఆర్థికంగా, సామాజికపరంగా కూడా తనకు అడ్వాంటేజీ ఉండటంతో ఆయన తనకు ఈసారి ఛాన్స్ దక్కుతుందన్నారు.కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంతో కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. అందుకే అమ్ముకున్నారని వ్యాఖ్యానించారు. ఇవన్నీ వేడి మీద చేసిన వ్యాఖ్యలే. కకోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి వెళ్లలేరు. టీఆర్ఎస్ లోకి కూడా అవకాశం లేదు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉండటం తప్ప మరో అవకాశం లేదు. ఇవన్నీ వారం,పదిరోజుల్లో సెట్ అవుతాయన్నది వాస్తవం.ఆయన పార్టీ మారుతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి .ఎంపీ తమ్ముడు మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా… కాంగ్రెస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్నాడని, ఇద్దరూ కలిసి కండువా మార్చుతారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోక మునుపే కండువా మార్చాలని వీరు యోచిస్తున్నారని సమాచారం.

Related Posts